వాషింగ్టన్, డిసెంబర్ 29: పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ (పీటీఎస్డీ) అనేది తీవ్రమైన మానసిక రుగ్మత. దీనికి చెక్ పెట్టే సరికొత్త పరికరాన్ని ఆవిష్కరించారు అమెరికాలోని సౌత్ కరోలినా మెడికల్ యూనివర్సిటీ పరిశోధకులు. ‘బయో వేర్’ అని పిలిచే ఈ పరికరాన్ని చేతికి ధరించాలి. ఇది పీటీఎస్డీ రోగుల్లో దీర్ఘకాలిక ఎక్స్పోజర్ థెరపీ ప్రభావాలను మెరుగుపరుస్తుంది. ఈ బయోవేర్ వ్యవస్థలో రోగి చొక్కాకు బటన్ ఆకారంలో ఉండే కెమెరాను అమర్చుతారు. మణికట్టు చుట్టూ వాచీలాంటి పరికరం, చెవిలో బ్లూటూత్ హెడ్ఫోన్ ఉంటాయి. ఈ వ్యవస్థ ఆధారంగా వైద్యులు పీటీఎస్డీ రోగులకు వర్చువల్గా థెరపీని అందిస్తారు. రోగిలో భయాన్ని పెంచే సంఘటనలను ధైర్యంగా ఎదుర్కొనేలా శిక్షణ ఇస్తారు. జెరిస్కోప్ అనే వైద్య పరికరాల సంస్థతో కలిసి సౌత్ కరోలినా పరిశోధకులు ఈ పరికరాన్ని పరీక్షించారు.