లండన్: యునైటెడ్ కింగ్డమ్ (UK) లో బాబెట్ తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. బలమైన ఈదురుగాలులతో కూడిన జల్లుల కారణంగా పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించిపోయింది. బాబెట్ ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో రహదారులను మూసివేశారు. రైళ్ల రాకపోకలను నిలిపి వేశారు. గాలివానల కారణంగా ఇప్పటికే ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు.
మరోవైపు లీడ్స్ బ్రాడ్ఫోర్డ్ విమానాశ్రయంలో తృటిలో పెను ప్రమాదం తప్పంది. రన్‌వేపై ల్యాండయ్యే క్రమంలో ఓ విమానం జర్రున జారి పక్కకు దూసుకెళ్లింది. దాంతో ఆ విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఎయిర్‌పోర్టులోని అధికారులు స్పందించి అత్యవసర సహాయక చర్యలు చేపట్టారు.
ప్రయాణికులందరినీ సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. విమానం ల్యాండవుతున్న సమయంలో రన్‌వే పూర్తిగా తడి ఉన్నదని, అదేవిధంగా గాలులు కూడా బలంగా వీస్తున్నాయని, ఈ రెండు కారణాలవల్లే విమానం జారి పక్కకు వెళ్లి ఉంటుందని అధికారులు చెప్పారు. ఈ ఘటన అనంతరం ఎయిర్‌పోర్టుకు రావాల్సిన ఇతర విమానాలను వేరే ఎయిర్‌పోర్టులకు దారి మళ్లించారు.