హేరాట్, అక్టోబర్ 7: అఫ్గానిస్థాన్‌ను శనివారం అరగంట పాటు భారీ భూకంపం కుదిపేసింది. పశ్చిమ ఆఫ్గాన్‌లో 6.3 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపం వల్ల 320 మంది మృతిచెందగా, వందలాది మంది గాయపడినట్టు ఐరాస వెల్లడించింది. భూకంపం కారణంగా పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. అనేక భవనాలు కుప్పకూలాయని, కూలిపోయిన భవనాల కింద పలువురు చిక్కుకుని ఉండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చని హేరాట్ ప్రావిన్స్‌కు చెందిన పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ మహమ్మద్ తాలేబ్ షాహిద్ తెలిపారు. ఉదయం 11 గంటలకు ఏర్పడిన ప్రకంపనలతో ఇండ్లు, కార్యాలయాలు వదిలి ప్రజలు భయంతో పరుగులు తీశారు.
తీవ్ర ప్రకంపనలకు కొన్ని భవనాలు నేలకూలడంతో పలువురు శిథిలాల కింద చిక్కుకుపోయారు. చాలా మంది కట్టుబట్టలతో హేరాట్ నగర వీధుల్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని సాయం కోసం ఎదురుచూస్తు కనిపించారు. హేరాట్
నగరానికి వాయవ్య మూల 40 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టు అమెరికా జియలాజికల్ సర్వే
వెల్లడించింది. 5.5, 4.7, 6.3, 5.9, 4.6 తీవ్రతతో ఐదుసార్లు ప్రకంపనలు చోటుచేసుకున్నట్టు ప్రకటించింది. కాగా, అఫ్గాన్‌లో తరచూ ఏర్పడే భూకంపాల కారణంగా తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం ఏర్పడుతుంది. గత ఏడాది జనవరిలో ఏర్పడిన భారీ భూకంపం వల్ల వెయ్యి మంది మృతి చెందగా, వేలాది మంది నిరాశ్రయులయ్యారు.