Heart Transplant | స్టాక్‌హోమ్, ఆగస్టు 21: మరణం ఖాయమైన వ్యక్తి గుండెను అమర్చి మరో మనిషికి ప్రాణం పోసే గుండె మార్పిడి ప్రక్రియకు ఎంతో మేలు చేసే పరికరాన్ని శాస్త్రవేత్తలు తయారు చేశారు. హైపోథెర్మిక్ ఆక్సిజెనేటెడ్ మెషీన్ పెర్ఫ్యూషన్(హోప్) అనే ఈ పరికరాన్ని హార్ట్ ఇన్ ఏ బాక్స్ అని కూడా పిలుస్తారు. ఇందులో గుండెను పెట్టి దాత వద్ద నుంచి అందుకునే వ్యక్తి వద్దకు సరఫరా చేస్తారు. ఇప్పటివరకు 4 డిగ్రీల సెల్సియస్ ఉండేలా చిన్న రిఫ్రిజిరేటర్లలో గుండెను తరలించే వారు. ఇందులో పొటాషియం సొల్యూషన్ నింపే వారు.
అయితే, ఈ పద్ధతిలో దాత నుంచి గుండెను తీసి తర్వాత నాలుగు గంటల్లోనే మరో వ్యక్తికి అమర్చాల్సి ఉంటుంది. సమయం మీరితే గుండె విఫలమవుతుంది. ఈ పరిస్థితిని మార్చడానికి హోప్ పరికరాన్ని తయారుచేశారు. ఇందులో పెడితే గుండె తొమ్మిది గంటల పాటు సజీవంగా ఉంటుందని స్వీడన్‌లోని గోథెన్బర్గ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు తేల్చారు. ఈ పరికరంలో గుండెకు ఆక్సిజన్‌తో పాటు పలు రకాల ఫ్లూయిడ్స్ సరఫరా అవుతూ ఉంటాయి. రిఫ్రిజిరేటర్లతో పోలిస్తే ఇందులో రవాణా చేసి ట్రాన్స్‌ప్లాంట్ చేసిన వారిలో గుండె విఫలమయ్యే ముప్పు కూడా 11 శాతం తక్కువ అని పరిశోధకులు తెలిపారు.