హరారే: ఆఫ్రికా ఖండంలోని జింబాబ్వే దేశంలో కలరా మహమ్మారి విజృంభిస్తున్నది. ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు 152 మంది మరణించారని, 8,087 అనుమానిత కలరా కేసులు, 1,241 నిర్ధారిత కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రెడ్ క్రాస్, రెడ్ క్రెసెంట్ సొసైటీల అంతర్జాతీయ సమాఖ్య తెలిపిన వివరాల ప్రకారం, అక్టోబరు నుంచి వారానికి 500కు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. కలుషిత ఆహారం, నీరు తీసుకోవడం వల్ల కలరా సంక్రమిస్తుంది. సరైన సమయంలో చికిత్స అందకపోతే, కొద్ది గంటల్లోనే రోగి మరణిస్తాడు. సకాలంలో గుర్తిస్తే, సులభంగా చికిత్స చేయవచ్చు.