అణ్వాయుధాలతోనే థర్డ్ వరల్డ్ వార్ ఉక్రెయిన్ వాటిని సంపాదిస్తే ఊరుకోబోం రష్యా విదేశాంగమంత్రి లావ్రోవ్ హెచ్చరిక బారెంట్స్ జలాల్లో అణు జలాంతర్గాములు సైబీరియాలో క్షిపణులను సిద్ధం చేసిన రష్యా లొంగకపోతే, ఉక్రెయిన్‌పై ప్రయోగం: విశ్లేషకులు అణు బాంబు వేస్తే వరల్డ్ వార్ అనివార్యమేనని వ్యాఖ్య
మాస్కో, మార్చి 2: ఉక్రెయిన్‌పై మిలిటరీ చర్యకు కొద్ది రోజుల ముందు రష్యా, బెలారస్ దేశాలు అణ్వాయుధాలను పరీక్షించాయి. ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటిస్తూ రష్యా అధ్యక్షుడు పుతిన్.. ‘మనది ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన న్యూక్లియర్ ఆయుధాలున్న దేశం’ అన్నారు. ఐదు రోజుల క్రితం ఆయన రష్యా అణ్వాయుధ బలగాలను అప్రమత్తం చేశారు. న్యూక్లియర్ బాంబులను సిద్ధం చేయాలని ఆర్డర్ వేశారు. బారెంట్స్ సముద్ర జలాల్లో అణు జలాంతర్గాములు, సైబీరియా అడవుల్లో ఖండాంతర క్షిపణి వ్యవస్థలను ఇప్పటికే రష్యా సిద్ధం చేసింది. తాజాగా బుధవారం రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లావ్రోవ్ నోటి నుంచి ‘మూడో ప్రపంచయుద్ధం. అణ్వాయుధాలు’ అన్న మాటలు వెలువడ్డాయి. కొన్ని రోజులుగా పుతిన్ మాట్లాడుతున్న మాటలు.. ఉక్రెయిన్‌పై, తమను వ్యతిరేకిస్తున్న దేశాలపై రష్యా వ్యవహారశైలిని గమనిస్తే అణుయుద్ధం తద్వారా మూడో ప్రపంచయుద్ధం తప్పకపోవచ్చన్న ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే యుద్ధంలో నిండా మునిగిన పుతిన్.. ఉక్రెయిన్ లొంగకపోతే ఎంతకైనా తెగించే ప్రమాదం ఉందని పలువురు అంతర్జాతీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే, పుతిన్ ఉక్రెయిన్‌పై అణ్వాయుధాలను ప్రయోగించాలంటే ఏదో ఒక సాకు కావాలి. ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాలు నేరుగా మిలిటరీ మద్దతిచ్చినా.. నాటో తమ బలగాలను ఉక్రెయిన్‌కు పంపినా దాన్ని కారణంగా చూపి పుతిన్ దాడులు చేయవచ్చని భావిస్తున్నారు. తాజాగా సెర్జీ లారోవ్ మాట్లాడిన మాటలు కూడా ఈ విశ్లేషణలకు బలాన్నిస్తున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ఫిబ్రవరి 24 ప్రారంభమైంది. ఎనిమిది రోజులైనా కొనసాగుతూనే ఉన్నది. ఉక్రెయిన్ వీరోచితంగా పోరాడుతున్నది.
మూడో ప్రపంచయుద్ధం వస్తే అది కచ్చితంగా అణ్వాయుధాలతోనే జరుగుతుదని లావ్రోవ్ వ్యాఖ్యానించారు. అణ్వాయుధాలతో యుద్ధం అత్యంత వినాశకరం అన్నారు. ఉక్రెయిన్ గనక అణ్వాయుధాలను సంపాదిస్తే తాము అణుయుద్ధాన్ని ఎదుర్కోవాల్సి రావొచ్చని పేర్కొన్నారు. అయితే అణ్వాయుధాలను సంపాదించే అవకాశాన్ని ఉక్రెయిన్‌కు ఇవ్వబోమని లావ్రో అన్నారు. ఇదిలా ఉండగా, అణ్వాయుధాల వాడకంపై ప్రపంచవ్యాప్తంగా నిషేధం ఉంది. అణ్వాయుధాలు లేని దేశంపై న్యూక్లియర్ బాంబులు వేయకూడదన్న ఒప్పందం కూడా ఉంది. రష్యా ఒకవేళ ఉక్రెయిన్‌పై అణ్వాయుధాలు ప్రయోగిస్తే మూడో ప్రపంచ యుద్ధం అనివార్యం అవుతుందని విశ్లేషకులు అంటున్నారు. అమెరికా, నాటో సభ్యత్వ దేశాలు తప్పక స్పందించాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. రష్యాకు మద్దతుగా కూడా కొన్ని దేశాలు ముందుకు రావొచ్చు.
ప్రపంచంలోనే తొలి అణ్వాయుధ పరీక్ష అమెరికాలోని న్యూ మెక్సికోలో 1945 జూన్ 16న జరిగింది. అదే ఏడాది ఆగస్టు 6న అమెరికా జపాన్‌పై అణుబాంబులు వేసింది. దాదాపు 3 లక్షల మంది చనిపోయారు. స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చి ఇన్స్టిట్యూట్(సిప్రి) ప్రకారం 2021 జనవరి నాటికి ప్రపంచంలో తొమ్మిది దేశాలు అమెరికా, యూకే, రష్యా, ఫ్రాన్స్, చైనా, భారత్, పాక్, ఇజ్రాయెల్, ఉత్తర కొరియా అణ్వాయుధాలను కలిగి ఉన్నాయి.