టోక్యో: దక్షిణ జపాన్లో ఉన్న టోకారా దీవుల్లో తీవ్ర స్థాయిలో భూ ప్రకంపనలు(Earthquakes) చోటుచేసుకుంటున్నాయి. గత రెండు వారాల్లోనే ఆ దీవుల్లో సుమారు 900 సార్లు భూమి కంపించింది. దీంతో స్థానికులు రాత్రిపూట నిద్ర లేకుండా గడుపుతున్నారు. జూన్ 21వ తేదీ నుంచి టోకారా దీవుల్లో సెసిమిక్ యాక్టివిటీ చాలా యాక్టివ్గా మారినట్లు అధికారులు చెప్పారు. బుధవారం అక్కడ 5.5 తీవ్రతతో భూకంపం వచ్చింది. ప్రస్తుతం అక్కడ ఎటువంటి నష్టం జరగలేదు. సునామీ వార్నింగ్ కూడా ప్రభుత్వం ఇవ్వలేదు. ఒకవేళ అవసరం అయితే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లవచ్చు అని ప్రభుత్వం పేర్కొన్నది.
భూ ప్రకంపనలు ఎక్కువ కావడం వల్ల నిద్ర పట్టడం లేదని స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ రేఖాంశంలో ఉన్న జపాన్లో సాధారణంగా భూకంపాలు తీవ్ర స్థాయిలో వస్తుంటాయి. ఆ దేశంలో ప్రతి ఏడాది 1500 భూ ప్రకంపనలు వస్తుంటాయి. టొకారాలో 12 దీవులు ఉన్నాయి. వాటిల్లో సుమారు 700 మంది జీవిస్తున్నారు. ఈ దీవుల్లో ఆస్పత్రులు ఉండవు. ఎమర్జెన్సీ అయితే సమీపంలో ఉన్న కగోషిమా దీవికి వెళ్తారు.