బ్రస్సెల్స్: ఒక వృద్ధురాలిలో ఒకేసారి ఆల్ఫా, బీటా కరోనా వేరియంట్స్‌ను పరిశోధనకులు గుర్తించారు. దీంతో చికిత్స పొందుతూ ఆమె ఐదు రోజుల్లోనే మరణించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తికి ఒకేసారి రెండు కరోనా వేరియంట్లు సోకినట్లు గుర్తించామని బెల్జియం పరిశోధకులు శనివారం వెల్లడించారు. 90 ఏండ్ల వృద్ధురాలికి ఈ ఏడాది మార్చి 3న కరోనా పరీక్షలో పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వ్యాక్సినేషన్ తీసుకోని ఆమెను అదే రోజు ఆల్స్ట్ నగరంలోని ఓఎల్‌వీ ఆసుపత్రిలో చేర్చారు. మొదట ఆమె ఆక్సిజన్ స్థాయిలు బాగానే ఉన్నాయని, అయితే ఐదు రోజుల్లోనే ఆరోగ్యం క్షీణించడంతో ఆ వృద్ధురాలు చనిపోయిందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు.
వైరస్ సోకిన ఇద్దరి నుంచి ఆ వృద్ధురాలికి ఒకేసారి ఆల్ఫా, బీటా కరోనా వేరియంట్స్ వ్యాపించినట్లు ఆసుపత్రి వైద్యులు గుర్తించారు. బ్రిటన్‌లో ఉద్భవించిన ఆల్ఫా, దక్షిణ ఆఫ్రికాలో తొలిసారి గుర్తించిన బీటా కరోనా వేరియంట్లు ఆ సమయంలో బెల్జియంలో వ్యాప్తి చెందాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ రెండు రకాల కరోనా వేరియంట్లు సోకిన ఇద్దరి నుంచి ఆ వృద్ధురాలికి సోకి ఉంటాయని పరిశోధనకు నేతృత్వం వహించిన ఓఎల్‌వీ ఆసుపత్రికి చెందిన మాలిక్యులర్ బయాలజిస్ట్ అన్నే వాంకీర్బర్గెన్ వెల్లడించారు. అయితే ఆ వృద్ధురాలి ఆరోగ్యం త్వరగా క్షీణించడానికి ఒకేసారి రెండు కరోనా వేరియంట్లు సోకడం కారణమా అన్నదానిపై స్పష్టత లేదని చెప్పారు.
మైక్రోబయాలజీ, అంటు వ్యాధులకు సంబంధించిన యూరోపియన్ కాంగ్రెస్‌కు తమ పరిశోధనా పత్రాలు అందజేసినట్లు వాంకీర్బర్గెన్ తెలిపారు. అయితే మెడికల్ జర్నల్‌లో ప్రచురణ కోసం ఇంకా సమర్పించలేదన్నారు. ఒక వ్యక్తికి ఒకేసారి రెండు కరోనా వేరియంట్లు సోకిన కేసుల గురించి ఇప్పటి వరకు ప్రచురణ కాలేదని చెప్పారు. ఈ విషయం గురించి తక్కువగా అంచనా వేయడంతోపాటు కరోనా వేరియంట్ల టెస్టింగ్ చాలా తక్కువగా ఉండటం దీనికి కారణమని అన్నారు.
జనవరిలో ఇద్దరు వ్యక్తులకు ఒకేసారి రెండు వైరస్ రకాలు సంక్రమించాయని బ్రెజిలియన్ శాస్త్రవేత్తలు కూడా నివేదించారు. అయితే తమ అధ్యయాన్ని శాస్త్రీయ జర్నల్‌లో ఇంకా ప్రచురించలేదన్నారు. కాగా, ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ కరోనా రకాలు సోకినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని వార్విక్ విశ్వవిద్యాలయానికి చెందిన వైరాలజిస్ట్, మాలిక్యులర్ ఆంకాలజీ ప్రొఫెసర్ లారెన్స్ యంగ్ తెలిపారు. ఒక వ్యక్తికి ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ కరోనా వేరియంట్లు సోకడం వల్ల అందించే వైద్య చికిత్స, టీకా సామర్థ్యంపై ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది అన్నదానిపై మరింతగా పరిశోధనలు చేసే అవసరాన్ని తమ అధ్యయనం హైలైట్ చేస్తుందని ఆయన వివరించారు.