ఓ వైపు రష్యా- ఉక్రెయిన్ యుద్ధం నడుస్తుండగానే.. చైనా మరో సంచలనానికి తెర లేపింది. తైవాన్ వైపు యుద్ధ విమానాలను పంపింది. అయితే ఇరు దేశాల మధ్య వివాదం కొత్తేమీ కాదు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. అయితే సరిగ్గా రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలోనే అటు చైనా కూడా తైవాన్ వైపు యుద్ధ విమానాలను పంపిన నేపథ్యంలోనే మళ్లీ ఈ చర్చ వార్తల్లోకి వచ్చింది. ఒక్క నెలలోనే 12 చైనా విమానాలు తైవాన్ వైపు వెళ్లినట్లు తెలుస్తోంది.
తాజాగా 9 చైనా యుద్ధ విమానాలు మళ్లీ తైవాన్ వైపు వెళ్లడం ఆసక్తికర పరిణామం. అయితే తైవాన్ కూడా అటు వైపు తమ యుద్ధ విమానాలను పంపింది. ప్రజలందరూ అత్యంత అప్రమత్తతతోనే వుండాలని తైవాన్ ప్రభుత్వం రేడియోల ద్వారా ప్రజలను హెచ్చరించింది. అడిజ్ ప్రాంతంలో చైనా యుద్ధ విమానాలు కనిపించాయని తైవాన్ ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. తైవాన్ గగన ప్రాంతంలోకి ఇతర దేశాల విమానాలు ప్రవేశించే సమయంలో తైవాన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్కు సమాచారం అందించాల్సి వుంటుంది. చైనా ఈ పనులేవీ చేయలేదని తైవాన్ ఆరోపిస్తోంది.