న్యూయార్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీ హత్యకు గురైన విషయం తెలిసిందే. 1963, నవంబర్ 22వ తేదీన ఆయన్ను డల్లాస్‌లో కాల్చి చంపారు. ఆ ఘటనకు చెందిన వేలాది ప్రభుత్వ దర్యాప్తు ఫైళ్ల(JFK Assassination Files)ను ఇవాళ రిలీజ్ చేశారు. నేషనల్ ఆర్కీవ్స్ వెబ్సైట్లో సుమారు 63 వేల పేజీల డాక్యుమెంట్లను అప్లోడ్ చేశారు. రాబోయే రోజుల్లో మరికొన్ని ఫైళ్లను డిజిటైజ్ చేసి అప్లోడ్ చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీ హత్యాయత్నం విచారణకు చెందిన ఫైళ్లను ఇన్నాళ్లూ క్లాసిఫైడ్గా ఉంచారని, ఇప్పుడు ఆ రికార్డులను బహిర్గతం చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
1960 దశకంలో జాన్ ఎఫ్ కెన్నడీతో పాటు సేనేటర్ రాబర్ట్ ఎఫ్ కెన్నడీ, సివిల్ రైట్స్ నేత మార్టిన్ లూథర్ జూనియర్ కింగ్‌లు హత్యకు గురయ్యారు. అయితే వాళ్ల హత్యలకు చెందిన ప్రభుత్వ విచారణ డాక్యుమెంట్లను రిలీజ్ చేస్తానని ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో ట్రంప్ పేర్కొన్నారు. జాన్ ఎఫ్ కెన్నడీ హత్య కేసులో ఆ నాటి ప్రభుత్వం హస్తం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వంలోని కొందరు పథకం ప్రకారమే కెన్నడీని షూట్ చేసి చంపించినట్లు రూమర్స్ ఉన్నాయి.
కెన్నడీ హత్యపై ప్రభుత్వ విచారణ రిపోర్టును చాలా మంది అమెరికన్లు విశ్వసించలేదు. అమెరికా మెరైన్ ఉద్యోగి లీ హార్వే ఓస్వాల్డ్ మాజీ అధ్యక్షుడు కెన్నడీని హత్య చేసినట్లు రిపోర్టులో ఉంది. కానీ గ్యాలప్ పోల్ సర్వే ప్రకారం.. 65 శాతం మంది అమెరికన్లు ఆ నివేదికను నమ్మడం లేదు. అమెరికా ప్రభుత్వంతో కుమ్మక్కై ఓస్వాల్డ్ హత్య చేసి ఉంటారని 20 శాతం మంది అమెరికన్లు విశ్వసించారు. కెన్నడీ హత్యలో సీఐఏ హస్తం ఉన్నట్లు మరో16 శాతం మంది నమ్మారు.
జేకెఎఫ్ హత్యకు చెందిన ఫైళ్ల కోసం దశాబ్ధాలుగా ప్రజలు ఎదురుచూస్తున్నారని, రికార్డులకు చెందిన సుమారు 80 వేల పేజీలు రిలీజ్ చేస్తున్నామని ట్రంప్ తెలిపారు. ఎన్నికల ప్రచార సమయంలో ఈ విషయాన్ని చెప్పానని, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నానని ట్రంప్ వెల్లడించారు. పారదర్శక పాలనలో భాగంగా ఆ ఫైళ్లను రిలీజ్ చేసినట్లు ఆఫీస్ ఆఫ్ ద డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ పేర్కొన్నది.