ముంబై: చంద్రుడిని టార్గెట్ చేస్తూ గత 70 ఏళ్లలో 111 సార్లు లూనార్ మిషన్ల(lunar missions)ను చేపట్టారని తెలుస్తోంది. దాంట్లో 62 మిషన్లు సక్సెస్ అయ్యాయని, 41 ప్రయత్నాలు విఫలం అయ్యాయని, మరో 8 ప్రయోగాలు సగం సక్సెస్ అయినట్లు నాసాకు చెందిన డేటాబేస్ ఆధారంగా స్పష్టమవుతోంది. శుక్రవారం చంద్రయాన్-3 నింగికి ఎగిరిన నేపథ్యంలో నాసా తన డేటాబేస్‌ను ప్రజెంట్ చేసింది. ఇస్రో పంపిన చంద్రయాన్-3 ఆగస్టు 23వ తేదీన 5.47 నిమిషాలకు జాబిలిపై ల్యాండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
చంద్రుడిపై చేపట్టిన మిషన్లలో సక్సెస్ రేటు 50 శాతం మాత్రమే ఉన్నట్లు ఇస్రో మాజీ చైర్మెన్ జీ మాధవన్ నాయర్ తెలిపారు. సూర్యుడి వల్ల గ్రహాలపై ప్రభావం చాలా ఉంటుందని, సూర్యుడి నుంచి వస్తున్న రేడియేషన్ వల్ల కొన్ని పరికరాలు దెబ్బ తినే ఛాన్సు ఉంటుందని, కానీ చంద్రయాన్1, 2 మాత్రం చంద్రుడి కక్ష్యను చేరినట్లు నాయర్ గుర్తు చేశారు.
1958 నుంచి 2023 వరకు ఇండియాతో పాటు అమెరికా, రష్యా, జపాన్, ఈయూ, చైనా, ఇజ్రాయిల్ దేశాలు చంద్రుడిపైకి స్పేస్‌క్రాఫ్ట్‌లను పంపాయి. వాటిల్లో ఆర్బిటార్లు, ల్యాండర్లు,ఫ్లయర్లు ఉన్నాయి. మూన్ మీదకు తొలి మిషన్‌ను 1958, ఆగస్టు 17వ తేదీన అమెరికా ప్రయోగించింది. పయోనీర్ 0 మిషన్ సక్సెస్ కాలేదు. ఆ సంవత్సరమే అమెరికాతో పాటు రష్యా ఆరుసార్లు మూన్ మిషన్లు చేపట్టినా అన్నీ విఫలం అయ్యాయి.
1959, జనవరి 2వ తేదీన రష్యా ప్రయోగించిన లూనా 1 మిషన్ మాత్రం పాక్షికంగా సక్సెస్ సాధించింది. ఇదే తొలి మూన్ ఫ్లైబై మిషన్ కావడం గమనార్హం. 1964 జూలై లో అమెరికా ప్రయోగించిన రేంజర్ 7 మిషన్.. చంద్రుడికి చెందిన క్లోజప్ ఫోటోను తీసింది. 1966 జనవరిలో రష్యా ప్రయోగించిన లూనా 9 స్పేస్‌క్రాఫ్ట్ .. సాఫ్ట్ ల్యాండింగ్ చేసింది. చంద్రుడి ఉపరితలానికి చెందిన తొలి ఫోటోలను ఆ స్పేస్‌క్రాఫ్ట్ రిలీజ్ చేసింది.
1969 జూలైలో అపోలో 11 మిషన్ చేపట్టారు. ఈ ప్రయోగం అంతరిక్ష చరిత్రలోనే మైలురాయి. ఆ స్పేస్‌క్రాఫ్ట్‌లో వెళ్లిన వ్యోమగాములు చంద్రుడిపై కాలు మోపారు. నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ నేతృత్వంలో ఆ మిషన్ జరిగింది. 1958 నుంచి 1979 వరకు కేవలం అమెరికా, రష్యా దేశాలు మాత్రమే మూన్ మిషన్లు చేపట్టాయి. ఆ 21 ఏళ్లలో రెండు దేశాలు మొత్తం 90 మిషన్లు చేపట్టాయి.
అయితే 1980 నుంచి 89 వరకు ఎటువంటి మూన్ మిషన్లు చేపట్టలేదు. జపాన్, ఈయూ, చైనా, ఇండియా, ఇజ్రాయిల్ దేశాలు ఆలస్యంగా ఈ కేటగిరీలోకి ఎంటర్ అయ్యాయి. 1990 జనవరిలో జపాన్ ఆర్బిటర్ మిషన్ నిర్వహించింది. ఆ తర్వాత 2007లో సెలీన్ అనే ఆర్బిటార్ మిషన్‌ను జపాన్ చేపట్టింది.