కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో మనుషులతోపాటు జంతువులు కూడా ఆ దేశాన్ని వీడుతున్నాయి. ఉక్రెయిన్ జూలోని అటవీ జంతువులను పొరుగు దేశాలకు తరలిస్తున్నారు. ఆరు సింహాలు స్పెయిన్, బెల్జియంలోని జంతు ఆశ్రయాలకు గురువారం చేరాయి. అలాగే ఉక్రెయిన్ రాజధాని కీవ్ సమీపంలోని జూకు చెందిన ఆరు పులులు, సింహాలు, రెండు అడవి పిల్లులు, ఒక అడవి కుక్కను లారీలో పోలాండ్లోని జంతు ప్రదర్శనశాలకు తరలించారు.
కాగా, నాలుగు సింహాలు, అడవి కుక్కలను డచ్ జంతు సంక్షేమ స్వచ్ఛంద సంస్థ ఏఏపీ నిర్వహణలోని తూర్పు స్పెయిన్‌లోని అలికాంటే రెస్క్యూ సెంటర్‌కు బుధవారం తరలించినట్లు ఆ సంస్థ ప్రకటించింది. జార్, జమీల్ అనే మరో రెండు సింహాలు తూర్పు బెల్జియం లిమ్‌బర్గ్ ప్రావిన్స్‌లోని షెల్టర్‌కు చేరాయని తెలిపింది. ఆరు పులులు, రెండు అటవీ పిల్లులను పశ్చిమ పోలాండ్లోని పోజ్నాన్లోని జూకు తరలించినట్లు పేర్కొంది.
మరోవైపు ఉక్రెయిన్ నుంచి పోలాండ్ సరిహద్దుకు జంతువులను తరలిస్తున్న లారీకి రష్యా యుద్ధ ట్యాంకులు ఎదురుపడ్డాయని పోలాండ్ జూ ప్రతినిధి తెలిపారు. ఈ నేపథ్యంలో లారీ డ్రైవర్ చాకచక్యంగా వాహనాన్ని మరో మార్గంలో మళ్లించాడని చెప్పారు. సుమారు వెయ్యి కిలోమీటర్లు ప్రయాణించి పోలాండ్ సరిహద్దు వద్దకు చేరిన ఆ జంతువులను మరో లారీలోకి ఎక్కించిన అనంతరం ఉక్రెయిన్ లారీ డ్రైవర్ తిరిగి తన ఇంటికి వెళ్లాడని వెల్లడించారు.