న్యూఢిల్లీ : అమెరికా వచ్చే ఏడాదిలో ఎంప్లాయ్మెంట్ బేస్డ్ గ్రీన్ కార్డ్‌లను అదనంగా 50,000 మంజూరు చేసే అవకాశం ఉంది. 75 దేశాల నుంచి వచ్చే ఇమిగ్రెంట్ వీసా దరఖాస్తులను ప్రాసెస్ చేయడాన్ని ఈ నెల 21 నుంచి నిలిపేయడమే దీనికి కారణం. ఫ్యామిలీ బేస్డ్ గ్రీన్ కార్డ్ కోటాలు నిరుపయోగంగా మిగిలిపోతే, వాటిని ఎంప్లాయ్మెంట్ బేస్డ్ గ్రీన్ కార్డ్ కోటాగా మార్చుతారు.
దీనిపై ఇమిగ్రేషన్ నిపుణులు స్పందిస్తూ, కొవిడ్ సమయంలో కూడా ఇలాగే జరిగిందని, ప్రయారిటీ డేట్స్ 4-5 ఏండ్లు ముందుకు జరిగాయని తెలిపారు. ఇమిగ్రేషన్ అటార్నీ ఎమిలీ న్యూమన్ మాట్లాడుతూ, 75 దేశాలపై అమెరికా నిషేధం విధించి ఉండకపోతే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ దేశాలకు దాదాపు 67,000 ఇమిగ్రెంట్ వీసాలను కేటాయించి ఉండేవారని తెలిపారు. ఈ దేశాలపై నిషేధం ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసే ఆర్థిక ఏడాది వరకు కొనసాగితే, 50,000 గ్రీన్కార్డ్లు ఉంటాయన్నారు.