Crocodiles Auction | బీజింగ్: రకరకాల అరుదైన, సాధారణ వస్తువులను వేలం వేయడం గురించి మనం వినే ఉంటాం. అయితే చైనాలో ఇటీవల కోర్టు ఆదేశాలతో ఏకంగా 500 సియామీ మొసళ్లను వేలానికి పెట్టడం అందరినీ ఆకర్షించింది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం.. వ్యక్తులెవరైనా మే 9 వరకు సాగే ఈ వేలంలో పాల్గొని భారీ మొసళ్లను తమ సొంతం చేసుకోవచ్చు.
గాంగ్డాంగ్ హోంగీ సంస్థ నిర్దిష్ట ఆర్థిక లావాదేవీలను నిర్వర్తించడంలో విఫలం కావడంతో ఆ సంస్థ పెంచుతున్న మొసళ్లను వేలం వేయాలని షెన్జెన్ నన్షన్ ప్రజా కోర్ట్ ఆదేశించింది. మొసళ్ల ప్రారంభ ధరను నాలుగు మిలియన్ల యువాన్లుగా(రూ.4.71 కోట్లు) నిర్ణయించింది. చైనాలో మొసళ్లను పెంచి వాటిని వ్యాపార వస్తువులుగా అమ్ముకోవచ్చు. మొసళ్ల మాంసం, చర్మానికి చైనాలో బాగా డిమాండ్ ఉంది. ఇక వాటి ఎముకలు, పళ్లు, రక్తాన్ని సంప్రదాయ మందుల తయారీలో, ఇతర అవసరాలకు ఉపయోగిస్తారు.