మాస్కో, జూన్ 19: ఉక్రెయిన్‌లో నిప్రో నగర సమపంలోని ఒక కమాండ్ సెంటర్‌పై క్షిపణి దాడి చేశామని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ దాడిలో 50 మందికి పైగా ఉక్రెయిన్ సైనిక జనరల్స్, అధికారులు మరణించారని ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నది. పలు ఉక్రెయిన్ యూనిట్లకు చెందిన కమాండర్లు సమావేశమైన ప్రాంతాన్ని రష్యా సైన్యం టార్గెట్‌గా చేసుకున్నదని తెలిపింది. అదేవిధంగా నికోలయేవ్ నగరంలోని ఓ ఫ్యాక్టరీ భవనంలో నిల్వ చేసిన పశ్చిమ దేశాలు సరఫరా చేసిన 10 ఎం777 హోవిట్జర్లు, 20 సాయుధ వాహనాలను ధ్వంసం చేసినట్టు రష్యా రక్షణశాఖ పేర్కొన్నది. మరోవైపు డాన్బాస్ రీజియన్‌లో 90 మంది రష్యా ఆక్రమణదారులను హతమార్చామని, రష్యా సైనిక ఆయుధాలను భారీయెత్తున ధ్వంసం చేసినట్టు ఉక్రెయిన్ ఆపరేషనల్ అండ్ టాక్టికల్ గ్రూప్(యూటీజీ) ప్రకటించింది.