న్యూయార్క్: అమెరికాలో మరోసారి తుపాకీ మోత మోగింది. దేశ వాణిజ్య రాజధాని న్యూయార్క్‌లో కాల్పులు (New York Shooting) కలకలం సృష్టించాయి. మాన్‌హట్టన్‌లోని (Manhattan) ఓ బిల్డింగ్‌లోకి చొరబడిన దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. దీంతో ఎన్‌వైపీడీకి (NYPD) చెందిన పోలీస్ సహా నలుగురు మృతి చెందారు. మరికొందరికి గాయాలయ్యాయి. పోలీసుల కాల్పుల్లో దుండగుడు హతమయ్యాడు. నిందితుడిని లాస్ వెగాస్‌కు చెందిన 27 ఏండ్ల షేన్ డెవోన్ తమురాగా గుర్తించారు.
సోమవారం సాయంత్రం 6.40 గంటల సమయంలో మ్యాన్‌హట్టన్‌లోని పార్క్ అవెన్యూ (Park Avenue) ఆకాశహార్మ్యంలోకి చొరబడిన తముర.. బిల్డింగ్‌లోని 32 అంతస్తు లాబీలో ఎన్‌వైపీడీ పోలీస్ అధికారిపై కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన అతడు మృతిచెందాడు. అనంతరం 33వ అంతస్తులోకి వెళ్లిన నిందితుడు విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడటంతో మరో ముగ్గురు మరణించారు. దీంతో ప్రజలు భయంతో పరుగులు పెట్టారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కాల్పులు జరపడంతో నిందితుడు కూడా గాయపడి ప్రాణాలు వదిలాడు.
అతడు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించాడని, ఏఆర్ సైల్ రైఫిల్‌తో కాల్పులు జరిపాడని పోలీసులు వెల్లడించారు. కాగా, ఈ బిల్డింగ్‌లో ఎన్ఎఫ్ఎల్ ప్రధాన కార్యాలయం, హెడ్జ్ ఫండ్ దిగ్గజం బ్లాక్‌స్టోన్‌తో సహా అనేక ప్రధాన ఆర్థిక సంస్థల కార్యాలయాలు ఉన్నాయి. కాల్పుల ఘటనను న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ ఖండించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా, అమెరికాలో ఈ ఏడాది ఇప్పటివరకు 254 మాస్ షూటింగ్ ఘటనలు చోటుచేసుకున్నాయి.