ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్య సమితి (United Nations) లోని శక్తిమంతమైన విభాగం భద్రతా మండలిలో (Security Council) తాత్కాలిక సభ్య దేశాలుగా అల్జీరియా, గయానా, సియెర్రా లియోన్, స్లొవేనియా, దక్షిణ కొరియా ఎన్నికయ్యాయి. రెండేండ్ల కాలపరిమితికి గాను ఐరాస సాధారణ సభ (General Assembly) తాత్కాలిక సభ్యదేశాలను (Non permenent members) ఎన్నుకున్నది. అయితే ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న యుద్ధంలో పాలుపంచుకుంటున్న బెలారస్కు (Belarus) ఎదురుదెబ్బ తగిలింది. ఆ దేశానికి సభ్యత్వం కల్పించేందుకు సభ్యదేశాలు తిరస్కరించాయి. కొత్తగా ఎన్నికైన దేశాలు 2014, జనవరి 1న బాధ్యతలు స్వీకరించనున్నాయి.
తాత్కాలిక సభ్యదేశాల ఎంపిక కోసం జరిగిన ఓటింగ్లో గయానాకు 191 ఓట్లు రాగా, సియెర్రా లియోన్ 188, అల్జీరియా 184, దక్షిణ కొరియాకు 180 ఓట్లు పోలయ్యాయి. ఇక ఐదో సభ్యదేశంగా బెలారస్కు స్లొవేనియాకు మధ్య పోటీ నెలకొనగా.. స్లొవేనియాకు 153 ఓట్లు వచ్చాయి. బెలారస్కు 38 ఓట్లు మాత్రమే నమోదయ్యాయి. కాగా, అల్బేనియా, బ్రెజిల్, గబాన్, ఘనా, యూఏఈ దేశాల పదవీ కాలం ఈ ఏడాది చివరితో ముగినునున్నది. ఈ నేపథ్యంలో కొత్తగా ఈ ఐదు దేశాలకు తాత్కాలిక సభ్యత్వం కల్పించారు. ఐరాస భద్రతా మండలిలో 15 దేశాలకు సభ్యత్వం ఉంటుంది. వాటిలో ఐదు శాశ్వత సభ్యదేశాలు కాగా.. పది అశాశ్వత సభ్యదేశాలు ఉంటాయి. దీని ప్రధాన కార్యాలయం న్యూయార్క్లో ఉన్నది. అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనాలు శాశ్వత సభ్యదేశాలు. వీటికి వీటో హక్కు ఉంటుంది.