Teacher – Student Love | న్యూఢిల్లీ, మే 27 : వియత్నాం పర్యటనకు వచ్చిన సందర్భంగా విమానం నుంచి దిగడానికి ముందు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్‌ను ఆయన భార్య బ్రిగిట్ మాక్రాన్ చెంపదెబ్బ కొట్టడం తీవ్ర చర్చనీయాంశం అయింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దీంతో వీరిద్దరి బంధం వార్తల్లోకి ఎక్కింది. మాక్రాన్ వయసు 47 ఏండ్లు కాగా, ఆయన భార్య వయసు 72 ఏండ్లు కావడం గమనార్హం. అమియన్స్లోని క్యాథలిక్ లైసీ లా ప్రావిన్సులో 1993లో మొట్టమొదటిసారి వారిద్దరూ కలుసుకున్నారు. అప్పుడు బ్రిగిట్ వయసు 39. ఆమె హైస్కూలు టీచర్. 15 ఏళ్ల ఇమ్మానుయేల్ ఆమె వద్ద విద్యార్థి. ఆండ్రూ లూయీస్ ఓజీర్ అనే బ్యాంకర్‌తో అప్పటికే పెళ్లయిన బ్రిగిట్కు ముగ్గురు పిల్లలు. ఆమె పెద్ద కుమార్తె ఇమ్మానుయెల్ క్లాస్మేట్. బ్రిగిట్, ఇమ్మానుయేల్ మధ్య ఏర్పడిన ప్రేమ బంధం 1994 వేసవిలో బయటపడింది. ఓ పూల్ వద్ద సన్‌బాతింగ్ చేస్తున్న వీరిని వారి కుటుంబ సభ్యులు చూశారు.
ఆ తర్వాత కొద్ది కాలానికే ఓజీర్ తన భార్య బ్రిగిట్కి విడాకులు ఇచ్చారు. బ్రిగిట్, ఇమ్మానుయేల్ బంధం ఎవరికీ నచ్చలేదు. బ్రిగిట్ కుటుంబానికి కొందరు ఆకాశ రామన్న ఉత్తరాలు రాశారు. కొందరైతే ఆమె ఇంటి గుమ్మం వద్ద ఉమ్మి తమ చీత్కారాన్ని వ్యక్తం చేశారు. తన స్నేహితులు ఒకరి తర్వాత మరొకరు తనతో మాట్లాడేందుకు కూడా ఇష్టపడలేదని బ్రిగిట్ తన ఆత్మకథలో రాసుకున్నారు. ఆ తర్వాత ఇమ్మానుయేల్ పై చదువుల కోసం తన సొంతూరిని విడిచిపెట్టి పారిస్ వెళ్లారు. అక్కడి యూనివర్సిటీలో పాలిటిక్స్, ఇంటర్నేషనల్ అఫైర్స్‌లో మాస్టర్స్ పూర్తి చేశారు. తమ మధ్య ఏర్పడిన బంధం నిలుస్తుందని తాను భావించలేదని, తన వయసుకు తగ్గ అమ్మాయితో ఇమ్మానుయేల్ ప్రేమలో పడతాడని తాను ఊహించానని బ్రిగిట్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. వారి మధ్య దూరం పెరిగినా బంధం మాత్రం చెక్కు చెదరలేదు. తరచు మాట్లాడుకునే వారు. వీలు దొరికినప్పుడల్లా కలుసుకునేవారు. చివరకు 2007లో వారిద్దరూ వివాహం చేసుకున్నారు.కాగా, చెంపదెబ్బ ఘటనపై మాక్రాన్ స్పందిస్తూ తన భార్య సరదాగానే చెంపను తాకినట్టు చెప్పారు.