కీవ్: ఉక్రెయిన్‌లో భారతీయ విద్యార్థుల పరిస్థితి దారుణంగా ఉంది. డేన్లో హలిస్కీ మెడికల్ వర్సిటీలో చదువుతున్న సుమారు 40 మంది విద్యార్థులు ప్రాణాల కోసం పోరాటం చేస్తున్నారు. లివివ్‌లో ఉన్న ఆ వర్సిటీ నుంచి వాళ్లంతా కాలినడకన పోలాండ్ బోర్డర్ వైపు వెళ్తున్నారు. బాంబు దాడుల నుంచి ప్రాణాలను రక్షించుకునేందుకు విద్యార్థులంతా వాకింగ్ చేస్తూ సరిహద్దు దిశగా ముందుకు వెళ్తున్నారు. ఉక్రెయిన్-పోలాండ్ బోర్డర్ రూట్లో తరలింపు ప్రక్రియ సాగుతోంది. కాలేజీ బస్సు ఆ విద్యార్థులను బోర్డర్‌కు 8 కిలోమీటర్ల దూరంలో నిలిపివేసినట్లు తెలుస్తోంది.
ఉక్రెయిన్‌లో దాదాపు 20 వేల మంది భారతీయులు చిక్కుకుపోయినట్లు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. తమను వెంటనే స్వదేశానికి తరలించాలని భారత ప్రభుత్వానికి వారు విజ్ఞప్తిచేశారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నామని వీడియో రూపంలో తమ ఆవేదనను తెలియజేస్తున్నారు. ఎక్కడికి వెళ్లి తల దాచుకోవాలో కూడా అర్థం కావట్లేదని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో స్వంత ఖర్చులతో విద్యార్థులను తీసుకువచ్చేందుకు భారత ప్రభుత్వం సిద్ధమైంది.