కీవ్: ఉక్రెయిన్‌లో కొన్ని రోజుల క్రితం మారియపోల్లోని డ్రామా థియేటర్‌పై రష్యా మిస్సైల్ దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో సుమారు 300 మంది మృతిచెంది ఉంటారని ఇవాళ ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ వెల్లడించింది. డ్రామా థియేటర్లో సుమారు 1300 మంది తలదాచుకుంటున్నట్లు తొలుత వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. థియేటర్ వద్ద పిల్లలు శరణార్థులగా తలదాచుకుంటున్నారని కూడా అక్కడ నేలపై రష్యన్ భాషలో రాశారు. కానీ రష్యా దళాలు ఆ థియేటర్‌పై దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. నిజానికి ఆ దాడిలో ఎంత మంది చనిపోయారో ఇంకా స్పష్టంగా లెక్క తెలియడం లేదు. ఉక్రెయిన్‌పై యుద్ధానికి వెళ్లిన రష్యా గత నెల రోజుల నుంచి పలు నగరాలపై దాడులు కొనసాగిస్తూనే ఉన్నది. ఓ మిలిటరీ ఫ్యూయల్ స్టోరేజ్ సెంటర్‌ను ధ్వంసం చేసినట్లు రష్యా ఇవాళ పేర్కొన్నది.
డ్రామా థియేటర్ నుంచి 200 మందిని రక్షించినట్లు ఇటీవల రష్యా మీడియా తెలిపింది. వెయ్యి మందికిపైగా మరణించారన్న వాదనలను రష్యా కొట్టిపరేసింది. శిథిలాల కింద నుంచి సుమారు 200 మంది కంటే ఎక్కువ మందిని కాపాడినట్లు నగర డిప్యూటీ మేయర్ సెర్గీ ఓర్లోవ్ తెలిపారు. డ్రామా థియేటర్‌పై దాడి జరిగిన రోజు తమ సైన్యం ఎటువంటి వైమానిక ఆపరేషన్ చేపట్టలేదని రష్యా మిలిటరీ చెప్పింది. తమ టార్గెట్ జాబితాలో ఆ థియేటర్ లేదని కూడా వెల్లడించింది.