హైదరాబాద్ : మధ్య అమెరికా దేశమైన హోండురాస్లో(Honduras) కాల్పుల సంఘటనలు కలకలం సృష్టించాయి. దుండగులు రెండు వేర్వేరు చోట్ల జరిపిన కాల్పుల్లో ఈ ఘటనల్లో 25 మంది మరణించారు. మృతుల్లో 6గురు పోలీసులు ఉన్నారు. గురువారం, దేశ ఉత్తర ప్రాంతంలోని ట్రుజిల్లో మునిసిపాలిటీలో భాగమైన రిగోరెస్లోని ఒక మారుమూల తోటలో కాల్పులు జరిగినట్లు పోలీసులు తెలిపారు. స్థానిక చర్చి వద్ద గుమిగూడిన కార్మికులపై సాయుధ అనుమానితులు విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు స్థానిక మీడియా పేర్కొంది.
కాగా, ఉత్తర హోండురాస్ చాలా సంవత్సరాలుగా వ్యవసాయ భూములపై వివాదం నెలకొంది. ఈ సారవంతమైన భూభాగంపై నియంత్రణ సాధించాలని చూస్తున్న సాయుధ శక్తులు స్థానిక రైతులను, కార్మికులను వారి భూముల నుండి బలవంతంగా వెళ్లగొడుతున్నాయని, దీని ఫలితంగా కొన్నిసార్లు ప్రాణాంతక దాడులు జరుగుతున్నాయని మానవ హక్కుల నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాల్పుల ఘటన అనంతరం హోండురాస్ సాయుధ దళాల సంయుక్త విభాగాధిపతి హెక్టర్ బెంజమిన్ వలేరియో ఆర్డాన్ ఒక ప్రకటన విడుదల చేస్తూ ఈ ఘటనకు బాధ్యులైన వారిని త్వరలోనే పట్టుకుంటామన్నారు. ఇప్పటికే భద్రతా బలగాలు, ఫోరెన్సిక్ నిపుణులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారని ఆయన తెలిపారు.