Indian Students | టొరంటో: విద్యాభ్యాసం కోసం భారత్ నుంచి తమ దేశానికి వచ్చిన వారిలో 20 వేల మంది ఆయా కళాశాలల్లో ప్రవేశాలు పొందలేదని కెనడా వలస, కాందిశీకుల, పౌరసత్వ సంస్థ(ఐఆర్సీసీ) వెల్లడించింది. బుధవారం గ్లోబల్ అండ్ మెయిల్లో ఇందుకు సంబంధించిన నివేదిక ప్రచురితమైంది. మొత్తం 49,476 మంది విద్యార్థుల్లో 6.9 శాతం మంది తాము ఐఆర్సీసీలో నమోదు చేసుకున్న విద్యా సంస్థల్లో ప్రవేశం పొందలేదని నివేదిక తెలిపింది. మొత్తం 3.27 లక్షల మంది విద్యార్థుల్లో 19,582 మంది(5.4 శాతం) విద్యార్థులు సంబంధిత కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో ప్రవేశానికి తమ సమ్మతి తెలపలేదని వెల్లడించింది. మరో 12,553 మంది ప్రవేశాల సమాచారం విద్యాసంస్థల వద్ద లేదని చెప్పింది.
విద్యార్థులతో పాటు ఇతరుల తాత్కాలిక నివాసితుల వీసాలు పెరగడాన్ని కూడా ఐఆర్సీసీ తన నివేదికలో పేర్కొంది. అయితే నివేదిక పేర్కొన్న దాని కంటే ఎక్కువ మంది భారత విద్యార్థులు కళాశాలల్లో ప్రవేశాలు పొంది ఉండరని వలసల విశ్లేషకుడు దర్శన్ మహరాజా తెలిపారు. అయితే కెనడాకు వచ్చాక తాము చేరదలచుకున్న విద్యా సంస్థ పోస్ట్ గ్రాడ్యుయేట్ వర్క్ పర్మిట్‌కు అర్హత కలిగి లేదని తెలుసుకున్నాక.. విద్యార్థులు వేరొక కాలేజీని ఎంపిక చేసుకుంటున్నారని.. ఈ సమాచారాన్ని ఐఆర్సీసీలో అప్డేట్ చేయకపోవడం వల్ల కళాశాలల్లో నమోదు కాని విద్యార్థుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తున్నదని దీక్షిత్ సోనీ అనే కన్సల్టెంట్ విశ్లేషించారు.