Russia | కీవ్: రాజధాని కీవ్ సహా ఉక్రెయిన్ నగరాలపై సోమవారం రష్యా భీకర క్షిపణి దాడులకు దిగింది. ఈ దాడుల్లో కనీసం 20 మంది చనిపోయారని, 50 మందికి పైగా గాయపడ్డారని ఉక్రెయిన్ అధికారులు మీడియాకు వెల్లడించారు. రాజధాని కీవ్‌లోని అతిపెద్ద పిల్లల దవాఖాన పైనా రష్యా క్షిపణి దాడులు జరిపింది. ఈ ఘటనలో పిల్లలు, వైద్య సిబ్బంది శిథిలాల కింద చిక్కుకుపోయారని, అక్కడ సహాయ ఆపరేషన్ చేపట్టామని అధ్యక్షుడు జెలెన్స్కీ ‘ఎక్స్’లో తెలిపారు. ఈ దాడులపై ప్రపంచ దేశాలు మౌనం వహించరాదని ఆయన కోరారు.
ఫ్రాన్స్ ఎన్నికల్లో ఎటూ తేలని తీర్పు
పారిస్: ఫ్రాన్స్‌లో జరిగిన ఆకస్మిక ఎన్నికల్లో ఓటర్ల తీర్పు స్పష్టంగా లేదు. ఆదివారం వెలువడిన ఫలితాల్లో లెఫ్ట్, సెంటర్, ఫార్ రైట్ పార్టీల్లో దేనికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తగినంత సంఖ్యాబలం రాలేదు. దీంతో ప్రధాన మంత్రి గాబ్రియేల్ అట్టల్ రాజీనామా చేశారు. అయితే ఆయన రాజీనామాను దేశాధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మెక్రాన్ సోమవారం తిరస్కరించారు. దేశ సుస్థిరత కోసం తాత్కాలికంగా ప్రభుత్వాధినేతగా కొనసాగాలని అట్టల్‌ను కోరారు.