లాహోర్, జనవరి 7: కాపాడాల్సిన కంటిరెప్పే కాటేసిన విధంగా, సాక్షాత్తూ కన్న తండ్రే కీచకుడై తమపై లైంగిక దాడులకు దిగడాన్ని ఇద్దరు మైనర్ కుమార్తెలు తట్టుకోలేక పోయారు. దీంతో కన్నతండ్రిపై పెట్రోల్ పోసి నిప్పంటించి సజీవ దహనం చేశారు. పాకిస్థాన్ పంజాబ్ ప్రావిన్స్‌లోని గుజ్రన్వాల, మొఘల్ చౌక్‌లో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. తండ్రి తమపై చేస్తున్న లైంగికి దాడి భరించ లేకే విధిలేక ఈ దారుణానికి దిగినట్టు ఆ బాలికలు తెలిపారు.
పోలీసుల కథనం ప్రకారం 48 ఏండ్ల అలీ అక్బర్‌కు ముగ్గురు భార్యలు. మొదటి భార్య మరణించగా, మిగిలిన ఇద్దరు భార్యలు, 10 మంది పిల్లలతో కలిసి అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. సోమవారం పడుకుని ఉన్న అక్బర్‌పై అతని 12, 15 ఏండ్ల కుమార్తెలు పెట్రోలు చల్లి నిప్పంటించారు. తీవ్ర గాయాలతో ఆయన దవాఖానలో చికిత్స పొందుతూ మరణించాడు. ‘కంటికి రెప్పలా కాపాడాల్సిన నాన్నే మాపై లైంగిక దాడి చేస్తున్నాడు. ఇక మా బాధ ఎవరికి చెప్పుకోవాలి. దీంతో విధిలేని పరిస్థితుల్లో అతడిని చంపాలని నిర్ణయించుకున్నాం. ఆయన బైక్‌లోని పెట్రోల్ తీసి చల్లి తగలబెట్టాం’ అని ఆ బాలికలు పోలీసులకు తెలిపారు.