ఢాకా, జూలై 21 : బంగ్లాదేశ్ వైమానిక దళానికి చెందిన శిక్షణ విమానం సోమవారం ఢాకాలోని ఓ స్కూలు భవనంపై కూలిపోగా 16 మంది విద్యార్థులు సహా 20 మంది మరణించారు. మృతుల్లో ఇద్దరు ఉపాధ్యాయులు, పైలట్ కూడా ఉన్నారు. మరో 171 మంది గాయపడ్డారు. ఢాకాలోని ఉత్తర ప్రాంతంలో గల మైల్స్టోన్ పాఠశాల, కళాశాలపై చైనా తయారీ ఎఫ్-7 శిక్షణ విమానం కూలిపోయింది. తరగతులు జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. విమానం కూలిపోయిన తర్వాత మంటలు చెలరేగి దట్టమైన పొగ వ్యాపించిన దృశ్యాలు టెలివిజన్లో ప్రసారమయ్యాయి. క్షతగాత్రులను నగరంలోని ఆరు దవాఖానాలకు సహాయక సిబ్బంది తరలించారు. బంగ్లాదేశ్ వైమానిక దళానికి చెందిన ఎస్-7 శిక్షణ విమానం ఢాకాలోని ఉత్తరలో కూలిపోయిందని, మధ్యాహ్నం 1.06 గంటలకు విమానం టేకాఫ్ అయిందని సైన్యానికి చెందిన ప్రజా సంబంధాల శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
మంటల్లో చిక్కుకున్న విమాన శకలాలపై నీళ్లు పోసి సహాయక సిబ్బంది మంటలను ఆర్పారు. స్కూలు భవనం పక్క గోడను ఢీకొన్న విమానం ఇనుప గ్రిల్స్ని ధ్వంసం చేసింది. విమానం ధాటికి స్కూలు భవనం గోడకు పెద్ద రంధ్రం పడింది. ఈ ఘటనలో 48 మంది వ్యక్తులు విషమ పరిస్థితిలో ఉన్నట్లు ప్రభుత్వ సలహాదారు ప్రొఫెసర్ డాక్టర్ మొహమ్మద్ సయెదూర్ రహ్మాన్ రాయిటర్స్ వార్తా సంస్థకు తెలిపారు. కాలిన గాయాలతో విద్యార్థులు ఆర్తనాదాలు చేస్తూ పరుగులు తీస్తున్న దృశ్యాలను టీవీ ప్రసారం చేసింది. ఇదిలా ఉండగా విమాన ప్రమాద ఘటనపై బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం మంగళవారం ఒక రోజు సంతాప దినాన్ని ప్రకటించింది. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేయడానికి ప్రభుత్వం ఉన్నత స్థాయి దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసింది.