ఖార్టూమ్ : సూడాన్ డార్ఫర్ ప్రాంతంలో అరబ్బులు, అరబ్బుయేతరుల మధ్య ఆదివారం ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘటనలో 168 మంది దుర్మరణం చెందగా.. మరో 98 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయాన్ని డార్ఫర్‌లో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించే ఓ సంస్థ జనరల్ కోఆర్డినేషన్ ప్రతినిధి ఆడమ్ రీగల్ తెలిపారు. గురువారం వెస్ట్ డార్ఫర్ ప్రావిన్షియల్ రాజధాని జెనెనాకు తూర్పున 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న క్రెనిక్‌లో గుర్తు తెలియని దుండగుడు ఇద్దరు వ్యక్తులను హతమార్చడంతో ఘర్షణలు చెలరేగాయని ఆయన చెప్పారు. ఆ తర్వాత హింస ఉగ్రరూపం దాల్చాయి. జాన్జావీద్ అనే మిలీషియాలు ఆదివారం క్రినెక్లో ఆయుధాలతో దాడి చేసి ఇండ్లను లూటీ చేసి, ఆ తర్వాత వాటిని తగలబెట్టారు.
అనంతరం ఘర్షణలు జెనీనాకు చేరగా.. సాయుధులు నగరంలోని ప్రధాన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిపై సైతం కాల్పులు జరిపారని ఆసుపత్రి వైద్యుడు సలాహ్ సలేహ్ పేర్కొన్నారు. గత గురువారం మొదలైన హింసలో 8 మంది చనిపోగా.. 16 మంది గాయపడ్డారు. ఆ తర్వాత భారీగా బలగాలను మోహరించినా.. హింసను అడ్డుకోలేకపోయారు. డార్ఫర్ ప్రాంతంలో కొన్ని ఆదివాసీ వర్గాల మధ్య వైరం కొనసాగుతున్నది. ఐక్యరాజ్య సమితి గణాంకాల ప్రకారం.. ఇప్పటి వరకు జరిగిన ఘర్షణల్లో మూడలక్షల మంది వరకు మృతి చెందగా.. 2.5 మిలియన్ల మంది జనం నిరాశ్రయులయ్యారు. ప్రధానంగా పచ్చిక బయళ్లు, నీటి కోసం తరుచూ ఘర్షణలు చెలరేగుతుంటాయి. సూడాన్‌లోని డార్ఫర్ ప్రాంతంలో ఇటీవలి నెలల్లో తెగల మధ్య ఘర్షణలు నెలకొంటున్నాయి. గత సంవత్సరం తిరుగుబాటు తర్వాత దేశం సంక్షోభంలో చిక్కుకున్నది.