బీరట్: లెబనాన్‌లోని హెజ్బొల్లా టార్గెట్లను ఇజ్రాయిల్ అటాక్(Israel Attack) చేసింది. సుమారు 1600 టార్గెట్లపై ఇజ్రాయిల్ వైమానిక దళాలు దాడి చేశాయి. ఆ దాడుల్లో మృతిచెందిన వారి సంఖ్య 492 చేరుకున్నది. మరోవైపు వేల సంఖ్యలో జనం ఇండ్లను విడిచి వెళ్తున్నారు. 2006 నుంచి మిలిటెంట్ సంస్థ హిజ్బొల్లా నిర్మించిన రహస్య ప్రదేశాలను కూల్చివేస్తున్నట్లు ఇజ్రాయిల్ తెలిపింది. ఇజ్రాయిల్ వైమానిక దాడికి ప్రతీకారంగా, హిజ్బొల్లా సుమారు 200 రాకెట్లను వదిలింది. ఇజ్రాయిల్, లెబనాన్ మధ్య భీకర యుద్ధం సాగుతుండగా, ప్రపంచ దేశాలు శాంతి సందేశాన్ని వినిపించాయి. దాడుల్ని ఆపాలని రెండు దేశాలను కోరాయి.
ఇజ్రాయిల్ దాడిలో మరణించిన వారిలో 35 మంది చిన్నారులు, 58 మంది మహిళలు ఉన్నారు. సుమారు 1645 మంది గాయపడ్డారు. దీంట్లో సాధారణ పౌరులు ఎంత మంది ఉన్నారో ఇంకా స్పష్టంగా తెలియదు. దాడుల వల్ల వేల సంఖ్యలో కుటుంబాలు చెల్లాచెదురు అయినట్లు ఆరోగ్యమంత్రి ఫిరాస్ అబియాద్ తెలిపారు. లెబనాన్‌ను మరో గాజాగా మార్చవద్దు అని యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ తెలిపారు. కొన్ని ఇండ్లల్లో హిజ్బొల్లా మిలిటెంట్లు.. మిస్సైళ్లు దాచిపెట్టారు. ఆ క్షిపణులకు చెందిన ఫోటోలను ఐడీఎఫ్ దళాలు రిలీజ్ చేశాయి.