అబుజా: సెంట్రల్ నైజీరియాలోని (Nigeria) పలు గ్రామాల్లో సాయుధ మూకలు కాల్పులకు తెగబడ్డాయి. దీంతో 160 మంది మరణించగా, మరో 300 మందికిపైగా గాయపడ్డారు. బండిట్స్‌గా (Bandits) పిలిచే మిలటరీ గ్యాంగ్‌లు 20 తెగలకు చెందిన ప్రజలే లక్ష్యంగా గ్రామాలపై కాల్పులకు పాల్పడ్డారు. పెద్ద సంఖ్యలో ఇండ్లను కాల్చివేశారు. ఈ మేరకు స్థానిక ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. మొదట ఆదివారం సాయంత్రం జరిగిన కాల్పుల్లో 16 మంది మరణించినట్లు వార్తలు వచ్చాయి. అయితే సోమవారం కూడా కాల్పులు కొనసాగడంతో మృతుల సంఖ్య భారీగా పెరిగిందని అధికారులు వెల్లడించారు. గాయపడిన వారిని దవాఖానలకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు.
మతపరమైన, సామాజిక పరమైన విబేధాల వల్ల ఈ ప్రాంతాల్లో కొన్నేండ్లుగా ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజా దాడులు కూడా చోటుచేసుకున్నాయి. 2009 నుంచి ఇప్పటివరకు జరిగిన ఘటనల్లో వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు.