ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో శనివారం ఉదయం జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో కనీసం 27 మంది దుర్మరణం చెందారని అధికారులు తెలిపారు. క్వెట్టా రైల్వే స్టేషన్లో ప్రయాణికులు రైలు కోసం ఎదురు చూస్తుండగా ఈ ఘటన సంభవించింది. ఆత్మాహుతి చేసుకోవాలనుకున్న వ్యక్తి తన లగేజీతో స్టేషన్లోకి ప్రవేశించాడని.. అలా ఆత్మాహుతి దాడి ఉద్దేశంతో వచ్చేవారిని ఆపడం కష్టమని క్వెట్టా డివిజిన్ కమిషనర్ హమ్జా షఫ్‌ఖాత్ వ్యాఖ్యానించారు. ఈ ఘటనలో గాయపడిన మరో 62 మందికి స్థానిక సివిల్ దవాఖానలో చికిత్స అందిస్తున్నారు. ఆత్మాహుతి దాడి తామే చేశామని ఉగ్రవాద సంస్థగా ముద్ర పడిన బలూచ్ వేర్పాటువాద గ్రూప్ బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఎ) ప్రకటించింది. సమాఖ్య ప్రభుత్వం బలూచిస్థాన్ వనరులను దోచుకొని అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తున్నదని బీఎల్ఎ ఆరోపించింది. అయితే సమాఖ్య ప్రభుత్వం ఈ ఆరోపణలను ఖండించింది.