Madagascar | ద్వీప దేశమైన మడగాస్కర్లో ఘోరం జరిగింది. మడగాస్కర్ రాజధాని అంటననారివోలో నిర్వహించిన క్రీడా పోటీల్లో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాటలో 12 మంది ప్రాణాలు కోల్పోగా, 80 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయాన్ని ఆ దేశ ప్రధాని క్రిస్టియన్ ఎన్ట్సే అధికారికంగా ప్రకటించారు.
అంటననారివో వేదికగా 11వ ఇండియన్ ఓసియన్ క్రీడల పోటీలను ప్రారంభించగా, ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు 50 వేల మంది ప్రేక్షకులు హాజరయ్యారు. ఈ క్రమంలో స్టేడియం ప్రధాన ద్వారం వద్ద తొక్కిసలాట జరిగింది. దీంతో పలువురు కిందపడిపోయారు. తీవ్ర గాయాలు కావడంతో బాధిత వ్యక్తులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఒకరికొకరు తోసుకోవడం వల్లే తొక్కిసలాట జరిగిందని మడగాస్కర్ అధ్యక్షుడు ఆండ్రీ రాజోలినా పేర్కొన్నారు. గత 40 ఏండ్లుగా నైరుతి హిందూ మహాసముద్ర దీవుల మధ్య పలు విభాగాల్లో క్రీడల పోటీలను నిర్వహిస్తున్నారు. ప్రతి నాలుగేండ్లకు ఒకసారి నిర్వహించే ఈ పోటీలను ఈసారి మడగాస్కర్లో నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 3వ తేదీ వరకు ఈ పోటీలు కొనసాగనున్నాయి.