Brazil Road Accident | బ్రెజిల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇసుక లోడ్‌తో వెళ్తున్న లారీ, బస్సు ఎదురెదురుగా వచ్చి వేగంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 11 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.
రియో గ్రాండే డో సుల్ రాష్ట్రంలోని కారాజిన్హో సమీపాన జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో ( మెక్సికో కాలమాన ప్రకారం) ఈ ప్రమాదం జరిగింది. ఇసుక లోడ్‌తో వస్తున్న లారీ, బస్సు వేగంగా ఢీకొన్నట్లుగా ఫెడరల్ హైవే పోలీసులు వెల్లడించారు. అయితే ఈ ప్రమాదంలో బస్సు క్యాబిన్ లారీలోకి చొచ్చుకునిపోయింది. అలాగే లారీలోని ఇసుక మొత్తం బస్సులోని ప్రయాణికులపై పడిపోయింది. దీంతో ఇసుక కింద పడి 11 మంది ప్రాణాలు కోల్పోగా.. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.

Brazil Road Accident1
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే లారీలోని ఇసుక మొత్తం బస్సులో పడిపోవడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. దీంతో చాలాసేపు ప్రయాసపడి మృతదేహాలను, గాయపడిన వారిని బయటకు తీశారు. అనంతరం వారిని ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ ప్రమాదం కారణంగా గంటల తరబడి హైవేపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.