సిటీబ్యూరో: వీధి కుక్కల దాడులు.. వాటి వల్ల జరుగుతున్న మరణాలపై ప్రభుత్వం అప్రమత్తమైంది. పసిపిల్లల ప్రాణాలు పోతుండటంతో నివారణ చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. ఈ నేపథ్యంలో తగిన చర్యలకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. ఈ మేరకు యానిమల్ వెల్ఫేర్ బోర్డు ఆఫ్ ఇండియా, యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్-2023కు అనుగుణంగా పురపాలికల స్థాయిల్లోనూ కమిటీలు వేస్తున్నది. ఇందులో భాగంగానే జోనల్ స్థాయి కమిటీలను బలోపేతం చేసేందుకు జీహెచ్ఎంసీ సన్నద్ధమవుతున్నది.
కమిటీ చైర్మన్గా సంబంధిత జోనల్ కమిషనర్, సభ్యులుగా డిప్యూటీ కమిషనర్లు, వెటర్నరీ అధికారులు, యానిమల్ వెల్ఫేర్ బోర్డు సభ్యుడు, స్థానిక ప్రజాప్రతినిధులు ఉండనున్నారు. కుక్కల విషయంలో చేయాల్సిన, చేయకూడని పనులపై విస్తృత ప్రచారం, అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కాగా, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ అధ్యక్షతన సోమవారం సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు కమిటీ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేశారు.