కేపీహెచ్‌బీ కాలనీ, ఆగస్టు 21 : మూసాపేట నుంచి ఆంజనేయనగర్ మార్గంలో రోడ్డు విస్తరణ బాధితులందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమత అన్నారు. శనివారం కూకట్పల్లి జోన్ కార్యాలయంలో రోడ్డు విస్తరణలో ఆస్తులు కోల్పోతున్న వారితో జడ్సీ మమత, డీసీ రవికుమార్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం భూములు, ఇండ్ల స్థలాలు కోల్పోతున్న నిర్వాసితులందరికీ న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. గతంలో ప్రైవేట్ భూములను సైతం ప్రభుత్వ భూములుగా గుర్తిస్తూ నష్టపరిహారం ఇవ్వలేదని.. వారి సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానన్నారు. ప్రభుత్వం జారీ చేసిన పట్టా భూములకు సైతం నష్టపరిహారం అందించేలా కృషి చేస్తామన్నారు. భూములు కోల్పోయిన వారందరూ ఆగస్టు 31లోగా సంబంధిత ధ్రువపత్రాలను సమర్పించాలని కోరారు. ధ్రువపత్రాలను పరిశీలించిన పిమ్మట బాధితులందరికీ న్యాయం జరిగేలా కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు పగడాల బాబురావు, తూము శ్రవణ్‌కుమార్, టౌన్‌ప్లానింగ్ అధికారులు పాల్గొన్నారు.