కేపీహెచ్బీ కాలనీ, ఆగస్టు 19 : కరోనా మహమ్మారిని కట్టడి చేయాలంటే వందశాతం ప్రజలు టీకాలు వేయించుకోవాలి… అయితే.. ఇప్పటికే 80 శాతం ప్రజలు టీకా లు వేయించుకోగా… వివిధ కారణాలతో కొందరు టీకాలకు దూరం గా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు కరోనా టీకా వేసుకోనివారిని గుర్తిం చి.. అందరికీ టీకా వేయడమే లక్ష్యంగా ఇంటింటికీ కరోనా టీకా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా జీహెచ్ఎంసీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శనివారం నుంచి కూకట్పల్లి జోన్ పరిధిలోని ఐదు సర్కిళ్లలో ఇంటింటికీ కరోనా టీకా ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు.
కూకట్పల్లి జోన్ పరిధిలో మూసాపేట, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, గాజులరామారం, అల్వాల్ సర్కిళ్లు ఉన్నాయి. ఈ ఐదు సర్కిళ్ల పరిధిలో 694 కాలనీలు ఉండగా.. 3,02,278 ఇండ్లు ఉన్నాయి. మూసాపేట సర్కిల్లో 117 కాలనీల్లో 1,07,828 ఇండ్లు, కూకట్పల్లి సర్కిల్లో 208 కాలనీల్లో 68,164 ఇండ్లు, కుత్బుల్లాపూర్ సర్కిల్లో 141 కాలనీల్లో 72,670 ఇండ్లు, గాజులరామారం సర్కిల్లో 69 కాలనీల్లో 76,922 ఇండ్లు, అల్వాల్ సర్కిల్లో 159 కాలనీల్లో 44,458 ఇండ్లు ఉన్నాయి. ఆయా కాలనీలు, బస్తీల్లో ప్రజలందరికీ అందుబాటులో ఉండే ప్రాంతాల్లో కరోనా వ్యాక్సినేషన్ సెంటర్లను ఏర్పాటు చేసి.. ఉచితంగా టీకాలను వేశారు. తాజాగా.. మొబైల్ వ్యాక్సినేషన్ డ్రైవ్లో కాలనీలు, బస్తీల్లో తాత్కాలిక కేంద్రాలను ఏర్పాటు చేసి టీకాలు వేశారు. ఈ రెండు ప్రక్రియలతో ఇప్పటికే 80 శాతానికి పైగా ప్రజలు టీకా వేసుకున్నారు.
కాలనీలు, బస్తీల్లోని ప్రజలందరికీ కరోనా టీకా వేయాలన్న లక్ష్యంతో ఇంటింటికీ కరోనా టీకా కార్యక్రమాన్ని చేపట్టారు. దీనికోసం సర్కిళ్ల పరిధిలోని కాలనీల వారీగా ప్రత్యేక బృందాలను సిద్ధం చేయనున్నారు. సర్కిల్ పరిధిలోని పారిశుధ్యం, ఎంటమాలజీ, ఇంజినీరింగ్, ప్రాజెక్టు విభాగంతో పాటు ఇతర విభాగాలకు చెందిన సిబ్బంది, ఆరోగ్య శాఖాధికారులతో కలిసి బృందాలను ఏర్పాటు చేశారు. ఎంపిక చేసిన కాలనీకి మొబైల్ వ్యాక్సినేషన్ బృం దం వెళ్లి.. ఇంటింటికీ తిరుగుతూ కరోనా టీకా వేయించుకున్నారా?.. లేదా..? అని వివరాలను సేకరిస్తారు. టీకా వేయించుకోకపోతే వెంటనే వారిని మొబైల్ వ్యాక్సినేషన్ వద్దకు తీసుకెళ్లి టీకా వేయిస్తారు. ఆ ఇంట్లో నివసిస్తున్న ప్రతి ఒక్కరూ టీకా వేయించుకుంటే.. ఆ ఇంటికి స్టిక్కర్ను అతికిస్తారు. అలాగే కాలనీ మొత్తం టీకా వేయించుకుంటే.. ఆ కాలనీలో బ్యానర్, స్టిక్కర్ల ద్వారా టీకా వేయించుకున్నట్లు ప్రదర్శిస్తారు. ఈ ప్రక్రియతో వందశాతం వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు భావిస్తున్నారు.
ఇంటింటికీ కరోనా టీకా కార్యక్రమం ఈ నెల 21 నుంచి ప్రారంభమవుతుంది. ఇంటింటికీ వెళ్లి కరోనా టీకా వేయించుకున్నారా? లేదా..? అన్న విషయాన్ని తెలుసుకునేందుకు ప్రత్యేక బృందాలను సిద్ధం చేస్తున్నాం. ఇంట్లో, కాలనీలో, డివిజన్లో, సర్కిల్లో నివసిస్తున్న అందరూ టీకా వేయించుకుంటే.. అక్కడ వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయినట్లు స్టిక్కర్లు అతికించడం, బ్యానర్లను ప్రదర్శించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కరోనా టీకా వేయించుకుని కరోనా కట్టడికి సహకరించాలి. – వి.మమత, జడ్సీ, కూకట్పల్లి