నాంపల్లి కోర్టులు, జూలై 11 (నమస్తే తెలంగాణ): తండ్రి, కూతురు ఆడుకుంటున్న వీడియోపై అసభ్యకర కామెంట్లు పోస్టు చేసిన యూ ట్యూబర్ ప్రణీత్ హన్మంతును సీసీఎస్, హెడ్క్వాటర్స్ పోలీసులు 6వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ఎదుట గురువారం హాజరుపర్చారు. ఇతరుల పోస్టుకు ప్రణీత్ కామెంట్లను పోస్టు చేశాడని, రిమాండ్‌ను తిరస్కరించాలని కోరుతూ నిందితుడి తరఫు న్యాయవాది కోర్టుకు వాదనలు వినిపించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. రిమాండ్‌కు తరలించాలని కోర్టును కోరారు. పీపీ వాదనలను ఏకీభవించిన కోర్టు నిందితుడికి 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ మెజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేశారు. నిందితుడిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. నిందితుడిపై 67-బీ ఐటీ యాక్టు, పోక్సో యాక్టుతో పాటు 79, 294 బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
డల్లాస్ నాగేశ్వర్రావు, బుర్రా యువరాజ్, పాయి ఆదినారాయణ పేర్లు సైతం ఎఫ్ఐఆర్లో చేర్చగా వారు పరారీలో ఉన్నట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. త్వరలో వారిని అదుపులోకి తీసుకుంటామని, విచారణ కొనసాగుతున్నదని పేర్కొన్నారు. రిటైర్డు ఐఎఎస్ అధికారి తనయుడైన ప్రణీత్.. యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లలో ప్రముఖుడని, రోస్ట్ వీడియోలు చేస్తూ లక్షమంది అభిమానులను సొంతం చేసుకున్నాడని రిపోర్టులో తెలిపారు. నిందితుడి సోదరుడు అజయ్ హన్మంతు ైస్టెలీష్ టిప్స్‌తో పాపులర్ ఛానల్ ‘ఏ జూడ్ ’ నడిపిస్తున్నట్టు వివరించారు. ‘డార్క్ కామెడీ’ పేరుతో తండ్రి- కూతురు వీడియోపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సినీ హీరోలు సాయిధరమ్ తేజా, మంచు మనోజ్, విశ్వక్సేన్, కార్తికేయ, సుధీర్‌బాబు సైతం స్పందించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని మెసేజ్‌ల ద్వారా తెలిపారు.