చిన్పప్పటి నుంచి అమ్మ వండిన వంటలు తినడమే తప్ప.. ఇప్పటి వరకూ వంటగదిలోకి వెళ్లింది లేదు. ఇటీవల చాలా మంది యువతులు చెప్పే సమాధానమిది. ఒకప్పుడు ఆడవాళ్లు వంట నేర్చుకోవాలంటే బామ్మలు, అమ్మల దగ్గర శిక్షణ పొందేవారు. ఇంకాస్త మంచి వంటలు నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్నవాళ్లు.. ఆ చుట్టుపక్కల ఉన్న వారిలో వంట ప్రావీణ్యం ఉన్న వారితో రెసిపీలు చెప్పించుకునేవారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. వంటింటి మహిళలూ స్మార్ట్ అయిపోయారు. తమకు నచ్చిన రెసిపీ పేరు స్మార్ట్ ఫోన్లో ఇలా టైప్ చేస్తూ, అలా చూస్తూ వండేస్తున్నారు. నగరంలో చాలామంది మహిళలు, ఉద్యోగినులు ఇదే తరహాలో వంటలు కానిచ్చేస్తున్నారు. ముఖ్యంగా పిల్లలకు రోజుకో వెరైటీ రుచి చూపించాలనే ఉద్దేశ్యంతో.. విదేశీ వంటకాలనూ చిటికెలో సిద్ధం చేస్తున్నారు.
నగర జీవనం బిజీగా మారింది. మహిళలకు క్షణం తీరికలేదు. ఇక ఉద్యోగినులైతే చెప్పనక్కర్లేదు. ఉదయం లేచింది మొదలు ఉరుకులు పరుగులు. ఓ వైపు పిల్లలకు నచ్చిన ఫుడ్ పెట్టాలనే ప్రేమ…మరోవైపు ఆఫీస్‌కు టైమ్ అవుతుందనే ఆందోళన. అందుకే రేపటి వంట కోసం ముందు రోజు రాత్రే సన్నద్ధమవుతున్నారు. స్మార్ట్ఫోన్లు, టీవీలను చూస్తూ కొత్త వంటల్లో ప్రావీణ్యం సంపాదించి ఉదయాన్నే గరిట తిప్పేస్తున్నారు.
వంటలు నేర్చుకోవడమే కాదు.. ఏకంగా వంట పాఠాలూ చెప్పేస్తున్నారు కొందరు మహిళలు. యూట్యూబ్‌లో ఉన్న వీడియోల ద్వారా వంటలు నేర్చుకుంటూ…పాక ప్రావీణ్యంలో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఆ వంటలకు సంబంధించిన వీడియోలను రికార్డ్ చేస్తూ…యూట్యూబ్‌లో అప్లోడ్ చేసేస్తున్నారు. ఇలా వందలాది వంటలు చేస్తూ యూట్యూబ్ చానళ్లు నిర్వహిస్తుండటం గమనార్హం.
బిర్యానీ, ఫ్రైడ్ రైస్, నాటుకోడి కూర, చికెన్ దమ్బిర్యానీ ఇలా…. మనరుచుల్నే కాకుండా స్మార్ట్ ఇండియన్, విదేశీ వంటకాలపైనా ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు. కాదేదీ నేర్చుకోవడానికి అనర్థం అంటూ….చైనా, జపాన్, మలేషియా, రష్యన్ వంటకాలనూ చకచకా చేసేస్తున్నారు. వంటింట్లోనే మాస్టర్ చెఫ్‌లుగా తయారైపోతున్నారు. ముఖ్యంగా విదేశీ రుచులైన రష్యన్ టీకేక్స్, క్రోటైటీ, రష్యన్ ైస్టెల్ చికెన్ కట్ లెట్స్, చైనీస్ ఫ్రైడ్ రైస్ ఇలా ఎన్నో రకాల వంటలను క్షణాల్లో వండేస్తూ రుచి చూసేస్తున్నారు. కాంటినెంటల్ ఫుడ్‌పైనా మక్కువ చూపుతున్నారు.
యూట్యూబ్‌తో పాటు దాదాపు అన్ని చానెళ్లు వంటల ప్రోగ్రాంలు ప్రసారం చేస్తున్నాయి. యూట్యూబ్‌లో చాలా మంది వెబ్ చానెల్లు ప్రారంభించి ప్రత్యేకమైన వంటలను ఎలా చేయాలో క్లుప్తంగా వీడియోల రూపంలో అందిస్తున్నారు. మధ్య మధ్యలో చిట్కాలు చెబుతూ ఆకట్టుకుంటున్నారు. వంటలపై వస్తున్న ఏ కార్యక్రమాన్ని నగర మహిళలు, యువతులు వదలడం లేదు. కావాల్సిన వంటలను ఎంచుకుని కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ కమ్మనైన రుచులను ఆస్వాదిస్తున్నారు.
పెళ్లి అయిన తర్వాతే….వంటగది అంటే ఎలా ఉంటుంది. వంట ఎలా చెయ్యాలో నేర్చుకున్నాను. యూట్యూబ్‌లో బామ్మ వంటలు, తెలుగు రెసిపీస్…ఇలా చాలా చానళ్లను చూస్తూ వంట నేర్చుకున్నాను. ఇప్పుడు ఏ వంటైనా క్షణాల్లో చేసే టాలెంట్ నా సొంతమైపోయింది. బంధువుల ఇంటికి వెళ్లినప్పుడు కూడా వంట చెయ్యమంటే….ముందు నేనే రెడీ అయిపోతున్నాను. – నిర్మల, గృహిణి, తుకారం గేట్
ఒకప్పుడు వంట చెయ్యాలంటే ఇబ్బందిగా ఉండేది.
కానీ…ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు, టీవీల దయ వల్ల వంట చెయ్యడం బాగా వచ్చేసింది. ఫోన్లో చూసి నేర్చుకున్న చైనీస్ వంటలంటే మా కుటుంబసభ్యులకు చాలా ఇష్టం. దాదాపు 30 రకాల చైనీస్ రుచులను వండేస్తాను. రష్యన్ వంటలూ నేర్చుకున్నాను. ఇప్పుడు నేను వంటింటి మహారాణిగా మారిపోయాను. – జీఎం నీతూ,గృహిణి, బొల్లారం