మేడ్చల్ కలెక్టరేట్, జూలై 8 : రోడ్డు విస్తరణ పనులను వెంటనే పూర్తి చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని నాగారం మున్సిపాలిటీ రాంపల్లిలో యువజన సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. నాగారం నుంచి యంనంపేట్ వరకు, చర్లపల్లి నుంచి కరీంగూడం వరకు చేపట్టిన రోడ్డు విస్తరణ పనులు నత్తనడకన ప్రమాదకరంగా నడుస్తున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.
రోడ్డు పనులు మొదలైన నాటి నుంచి 8 మంది ప్రాణాలు పోయాయని అనేక మందికి ప్రమాదాలు జరిగాయని, ప్రమాదాలు జరుగుతున్న ప్రభుత్వం అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువజన సంఘాల నాయకులు, ఇస్మాయిల్ ఖాన్ గూడ, కరీంగూడ నాయకులు, వాహనదారులు, ప్రయాణికులు, వివిధ కాలనీ వాసులు పాల్గొన్నారు.