Crime News | సిటీబ్యూరో: నగరంలో గంజాయి, మద్యం మత్తులో యువకులు చెలరేగిపోతున్నారు. ఇష్టానుసారంగా దాడులకు తెగబడుతున్నారు.. సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం అర్ధరాత్రి జరిగిన మూకదాడి దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. మత్తులో ఆ యువకులు అర్ధరాత్రి వీరంగం చేస్తుంటే.. ఇదేంటని అడిగిన పాపానికి ఓ వ్యక్తిని దారుణంగా కొట్టారు. సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని నేతాజీనగర్‌లో గురువారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకున్నది. చైతన్యపురి మెట్రో స్టేషన్‌కు సమీపంలోని నేతాజీనగర్‌లోని రోడ్డుకు ఒక వైపు ఖాళీ స్థలంలో అర్ధరాత్రి 2 గంటల సమయంలో శంకు యాదవ్, వంశీ, షాహిద్, హరీశ్, సోను, సుమన్ మరికొందరు ఖాళీ స్థలంలో కూర్చొని.. న్యూసెన్స్ చేస్తున్నారు. స్నేహితుడి పుట్టిన రోజు వేడుకలను గట్టిగా అరుస్తూ..న్యూసెన్స్ చేస్తుండటంతో ఎదురుగా ఉండే ఓ వ్యక్తి వచ్చి న్యూసెన్స్ చేయవద్దని, అలా చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరించాడు. వాళ్ల ఫొటోలు తీసుకొని వెళ్లిపోయాడు. కొద్ది సేపటి తరువాత ఆ యువకులు ఎదురింటిపై రాళ్లు విసురుతూ హంగామా చేస్తూ భయభ్రాంతులకు గురిచేశారు.
ఆ ఇంట్లో కిరాయికి ఉన్న వాళ్లు ఎవరూ బయటకు రాలేదు. భయంతో లోపలే ఉండిపోయారు. అయితే ఇంటి యజమాని జనార్దన్‌నాయుడుకు ఫోన్ చేసి ఇంటిపై కొందరు రాళ్లు విసిరి అద్దాలు పగులగొడుతున్నారంటూ సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే జనార్దన్‌నాయుడు ఘటనాస్థలికి చేరుకొని తన ఇంటిపై జరిగిన దాడి, ధ్వంసమైన అద్దాలను పరిశీలిస్తున్నాడు. ఈ క్రమంలో జనార్దన్ వద్దకు వచ్చిన యువకులు.. ఇష్టానుసారంగా ఆయనపై కర్రలతో దాడికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని బాధితుడిని 108లో చికిత్స కోసం వైద్యశాలకు తరలించారు. ఆ యువకులు మద్యం మత్తులో ఉన్నారని, గంజాయి తీసుకోలేదని సరూర్‌నగర్ ఇన్స్పెక్టర్ సైదిరెడ్డి చెబుతున్నారు. కేసు నమోదు చేసి ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచామని, నిందితులకు కోర్టు రిమాండ్ విధించిందని వెల్లడించాడు.