బాలానగర్, ఆగస్టు 27 : ఆలయ నిర్వహణలో తలెత్తిన వివాదం, తాగిన మైకంలో అన్న కుమారుడిని తమ్ముడి కుమారుడు రాడ్‌తో కొట్టి, గొడ్డలితో నరికి హత్య చేశాడు. అడ్డు వచ్చిన పెద్దమ్మపై (మృతుడి తల్లి) కూడా దాడి చేయడంతో.. గాయాలకు గురైన ఆమెను సికింద్రాబాద్‌లోని కిమ్స్ దవాఖానలో చేర్పించగా ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగానే ఉన్నదని సమాచారం.
ఈ ఘటన బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ కె.నవీన్‌కుమార్ కథనం ప్రకారం.. బాలానగర్ డి.సంజీవయ్య కాలనీకి చెందిన ఏరుపుల రాజమల్లయ్య, మనోహర్ అన్నదమ్ములు. రాజమల్లయ్యకు భార్య సావిత్రి (65), ఇద్దరు కుమారులు సాయి, ముఖేంధర్ (42) ఉన్నారు. ముఖేంధర్కు భార్యా, ఇద్దరు కుమారులున్నారు. ముఖేంధర్ వాటర్ ఫ్యూరీఫైర్ టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడు. మనోహర్‌కు నలుగురు కుమారులు వెంకట్, మహేందర్, సూరి, మధు ఉన్నారు. మనోహర్ చిన్న కుమారుడు ఏరుపుల మధు (40) ఆటో నడుపుతున్నాడు.
ఇదిలా ఉండగా.. రాజమల్లయ్య, మనోహర్ కుటుంబాల మధ్య గత కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం రాజమల్లయ్య చిన్న కుమారుడు ముఖేంధర్ ఇంటి వద్ద ఉండగా.. మనోహర్ చిన్న కుమారుడు మధు పాత కక్షలను మనసులో పెట్టుకొని తాగిన మైకంలో రాడ్‌తో దాడి చేసి, ఆ తర్వాత గొడ్డలితో తలపై నరికాడు. దీంతో, ముఖేంధర్ తలకు తీవ్ర గాయాలై కిందపడిపోయాడు. వెంటనే అతడిని చికిత్స కోసం స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు దవాఖానకు తరలించగా.. అక్కడి వైద్యులు పరిశీలించి మృతి చెందినట్లుగా ధ్రువీకరించారు.
కొడుకును గొడ్డలితో నరుకుతున్న సమయంలో అడ్డు వచ్చిన మృతుడి తల్లి సావిత్రిపై కూడా మధు దాడి చేయడంతో.. ఆమె తీవ్ర గాయాలతో సికింద్రాబాద్‌లోని కిమ్స్ దవాఖానలో చికిత్స పొందుతున్నది. ముఖేంధర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ దవాఖాన మార్చురీకి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాలానగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా.. మధుపై గతంలో బాలానగర్ పీఎస్ పరిధిలో పలు కేసులు ఉన్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.