Hyderabad | బంజారాహిల్స్, ఫిబ్రవరి 26: ఆమె సమస్యలను అతను ఆసరాగా చేసుకున్నాడు. ప్రొబ్లెంస్ మొత్తం తీర్చేస్తానని పరిచయం పెంచుకున్నాడు. పెళ్లయిన అమ్మాయి అని తెలిసి కూడా ఆమెతో సన్నిహితంగా మెలిగాడు. ఇప్పుడు నువ్వు నాకే కావాలి.. నాతోనే ఉండాలంటూ ఆమెపై ఒత్తిడి చేశాడు. తనను పెళ్లిచేసుకోవాలని బలవంతపెట్టాడు. అందుకు ససేమీరా అనడంతో ఆ అమ్మాయిపైనే దాడికి దిగాడు. భయపడి పారిపోతే కుటుంబసభ్యులపైనే సదరు యువకుడు బెదిరింపులకు పాల్పడ్డాడు. చివరకు బాధితురాలు హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెం 10లోని జహీరానగర్‌కు చెందిన రేష్మా బాను(28) అనే మహిళ బ్యూటీషియన్‌గా పనిచేస్తుంటుంది. ఆమెకు పదేళ్ల క్రితం మహ్మద్ గౌస్ అనే వ్యక్తితో పెళ్లవగా ఇద్దరు పిల్లలున్నారు. భర్తతో విభేదాల కారణంగా 2018లో విడాకులు ఇచ్చిన రేష్మా బాను ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటోంది. కాగా గత కొంతకాలం కిందట ఆమెకు కొన్ని సమస్యలు ఎదురవడంతో వాటిని పరిష్కరిస్తానంటూ ఎర్రగడ్డ సుల్తాన్ నగర్‌కు చెందిన చెఫ్ అమీర్‌ఖాన్(25) పరిచయం పెంచుకున్నాడు. కొన్నాళ్ల పాటు వారిద్దరూ సన్నిహితంగా ఉన్న తర్వాత గత ఏడాది జూలైలో పెళ్లి చేసుకుంటానంటూ అమీర్‌ఖాన్ ప్రతిపాదించగా రేష్మా బాను నిరాకరించింది.
తనకు పెళ్లిమీద ఆసక్తిలేదని ఉద్యోగం కోసం త్వరలో సౌదీ అరేబియా వెళ్తున్నానంటూ రేష్మా చెప్పింది. అప్పటినుంచి అమీర్ ఖాన్ ప్రవర్తనలో మార్పు వచ్చింది. తనను వదిలిపెట్టి సౌదీకి ఎలా వెళ్తావో చూస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ క్రమంలోనే నాలుగు నెలల కింద ఇంటికి వచ్చి పాస్‌పోర్టు లాక్కొని వెళ్లిపోయాడు. తాజాగా మరోసారి అర్ధరాత్రి సమయంలో రేష్మా భాను ఇంటికి వచ్చిన అమీర్‌ఖాన్.. ఆమెపై దాడి చేశాడు. సెల్ఫోన్లు లాక్కొని వెళ్లిపోయాడు. ఈ ఘటనతో భయబ్రాంతులకు గురైన రేష్మా.. అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. రేష్మా కనిపించకపోవడంతో ఆచూకీ కోసం ఆమె కుటుంబసభ్యులకు అమీర్‌ఖాన్ ఫోన్లు చేశాడు. రేష్మా ఆచూకీ చెప్పకపోతే అంతుచూస్తానని బెదిరించాడు. ఈ క్రమంలో బుధవారం ఉదయం రేష్మా బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. రేష్మా ఫిర్యాదు మేరకు అమీర్‌పై బీఎన్ఎస్ 329(4),115(2),307,351(2), 351(2)(3) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.