చార్మినార్, డిసెంబర్ 27 : నిత్యం కొత్త ఆలోచనలతో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటున్న నేటితరం రోజుకో ఆవిష్కరణ చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారని దక్షిణ భారతదేశ పేటెంట్లు, డిజైన్ల ప్రాంతీయ కార్యాలయ కమిషనర్ కూకట్ల వరప్రసాద్ తెలిపారు. మంగళవారం సిటీ కాలేజీ జంతుశాస్త్ర విభాగం మేథోసంపత్తి హక్కులపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 140 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో ఏడాదికి కేవలం 70వేల దరఖాస్తులు మాత్రమే అందుతున్నాయని, ఇతర దేశాలతో పోల్చితే మన దగ్గర నమోదయ్యేవి చాలా తక్కువ అన్నారు.
విద్యార్థుల కంటి చూపు సమస్యలను దూరం చేసేలా ఓ పాఠశాల విద్యార్థి కళ్లజోడును ఆవిష్కరించి తన ప్రతిభను చాటుకున్నాడని గుర్తు చేశారు. అతడు తయారు చేసిన కళ్లజోడు కోసం పేటెంట్ హక్కులు పొందినట్లు తెలిపారు. అధ్యాపకుల మార్గదర్శకత్వంలో కాలేజీలో ఆవిష్కరణల్లో పాలుపంచుకుంటూ వారి పేటెంట్ కోసం దరఖాస్తు చేయాలన్నారు. ఈ సమావేశంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ విప్లవదత్ శుక్లా, అధ్యాపకులు శ్రీదేవి, ఆనంద్, చిత్తరంజన్‌దాస్, నాగరాజు, నర్మద, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.