
సికింద్రాబాద్/ఉస్మానియా వర్సిటీ, డిసెంబర్ 20: రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యం మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందేనని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అన్నారు. ధాన్యం కొనుగోలుపై కేంద్రం మొండి వైఖరి వీడకుంటే రైతులతో కలిసి ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సోమవారం సికింద్రాబాద్, కంటోన్మెంట్ వ్యాప్తంగా టీఆర్ఎస్ కార్యకర్తలు, బోర్డు మాజీ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. కంటోన్మెంట్‌లోని జూబ్లీ బస్ స్టేషన్ (జేబీఎస్)వద్ద ఎమ్మెల్యే సాయన్న, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్‌రెడ్డి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధ్దం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాయన్న మాట్లాడుతూ ..రైతు సంక్షేమ ప్రభుత్వమని చెప్పుకుంటున్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయకుండా మోసం చేస్తుందని మండిపడ్డారు. రాష్ట్రంలోని రైతుల పక్షాన కేంద్ర ప్రభుత్వానికి ధాన్యం సేకరించాలని చెప్పలేని ఇక్కడి ప్రాంత బీజేపీ నాయకులు పూటకో మాట చెప్పుతూ పబ్బం గడుపుకుంటున్నారని ధ్వజమెత్తారు. రైతును రాజుగా నిలబెట్టేందుకు సీఎం కేసీఆర్ అనేక పథకాలతో ముందుకుసాగుతున్నారని, ఇప్పటికే వ్యవసాయానికి ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా, చెరువుల పునరుద్ధ్దరణ, విత్తన, ఎరువుల కొరత నియంత్రణ వంటి పకడ్బందీ చర్యలతో రైతులు సంతోషంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో బోర్డు మాజీ సభ్యులు లోక్నాథం, పాండుయాదవ్, నళినికిరణ్, ప్రభాకర్, టీఆర్ఎస్ నేతలు నివేదిత, మార్కెట్ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్, నర్సింహ ముదిరాజ్, పిట్ల నగేష్, నరేందర్‌రెడ్డి, తేజ్‌పాల్, దేవులపల్లి శ్రీనివాస్, శర్విన్, లతా మహేందర్, సదానంద్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి మార్చుకోవాలి
ధాన్యం కొనుగోలులో కేంద్రప్రభుత్వం అవలంబిస్తున్న మొండి వైఖరిని మార్చుకోవాలని టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర రైతులపై కేంద్ర వివక్షకు నిరసనగా రాష్ట్రవ్యాప్త కార్యక్రమాలు చేపట్టాలని టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రైతులకు అండగా నిలబడేందుకు టీఆర్ఎస్ అనుబంధ విద్యార్థి విభాగం టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో కేంద్రప్రభుత్వ దిష్టిబొమ్మను ఉస్మానియా యూనివర్సిటీ ఎన్సీసీ గేటు వద్ద దహనం చేసింది. కార్యక్రమంలో టీఆర్ఎస్వీ ఉపాధ్యక్షులు కడారి స్వామి, కోతి విజయ్, ప్రధాన కార్యదర్శులు హరిబాబు, వెంకట్‌గౌడ్, నవీన్, దశరథ్ తదితరులు పాల్గొన్నారు.
రైతుల ఉసురు తగలక తప్పదు
సికింద్రాబాద్, డిసెంబర్ 20: ఏడేండ్ల్లుగా కేసీఆర్ ప్రభుత్వం రైతును రాజు చేయడమే ధ్యేయంగా కృషిచేస్తుంటే, కేంద్ర ప్రభుత్వం రైతులను పట్టించుకోకుండా కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తోందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న ధ్వజమెత్తారు. ఈ మేరకు సోమవారం నియోజకవర్గంలో జరిగిన కేంద్ర ప్రభుత్వంపై నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల వద్ద నుంచి రాష్ట్రం స్థోమతకు మించి ధాన్యం కొనుగోలు చేస్తుంటే, కేంద్రం ఏమాత్రం పట్టదన్నట్లు చూస్తుండడం చేతగానితనానికి నిదర్శనమని దుయ్యబట్టారు. ఆరుగాలం కష్టపడి పంటలు పండించే రైతుల పాపం ఊరికే పోదని, ధాన్యం కొనుగోలు చేయని కేంద్ర ప్రభుత్వానికి ఉసురు తగులుతుందని విమర్శించారు.