Hyderabad | సిటీబ్యూరో: ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో గురువారం మధ్యాహ్నం నుంచి గ్రేటర్లో ఎడతెరిపి లేకుండా కుండపోత వాన కురిసింది. రాత్రి 7గంటల వరకు నగరంలోని హిమాయత్‌నగర్, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ప్రాంతంలో అత్యధికంగా 9.6 సెం.మీలు వర్షపాతం నమోదైనట్లు టీజీడీపీఎస్ అధికారులు వెల్లడించారు.
ఇదిలా ఉండగా ద్రోణి బలహీనపడినప్పటికీ ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండడంతో రాగల మరో మూడు రోజులు గ్రేటర్‌లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు, మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వానలు కురిసే అవకాశాలున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో గ్రేటర్‌కు వాతావరణ కేంద్రం అధికారులు ఎల్లో హెచ్చరికలు జారీచేశారు.
అస్తవ్యస్తంగా మారిన జనజీవనం
గ్రేటర్లో గురువారం కురిసిన మోస్తరు వానకే నగరం చిత్తడైంది. చాలా చోట్ల వర్షం నీరు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో రోడ్లన్నీ చెరువులను తలపించాయి. పలు చోట్ల ఈదురు గాలులతో చెట్లు నేలకూలాయి. విద్యుత్‌కు అంతరాయం తప్పలేదు. వివిధ ప్రాంతాల్లో గంటల తరబడి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
భూగర్భ సంపులు విఫలం
రోడ్లపై వర్షపు నీరు నిల్వకుండా సచివాలయం, రాజ్‌భవన్, సోమాజిగూడ మెర్క్యూర్ హోటల్ సమీపంలో నిర్మించిన భూ గర్భ సంపులు పని రాకుండా పోయాయి. భారీగా వరద నీరు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జాం నెలకొంది. ముఖ్యంగా సచివాలయం సాక్షిగా వరద నీరు నిలిచిపోయింది. రాజ్‌భవన్, సోమాజిగూడలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో భూ గర్భ సంపులు సైతం వాన కష్టాలను తీర్చలేకపోయాయని అటుగా వెళ్లే వాహనదారులు మండిపడ్డారు.
కోట్లాది రూపాయలతో నిర్మాణాలు
వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద నీరు నిలుస్తుండడంతో ట్రాఫిక్ జామ్ అవుతూ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అంచనా వేసిన అధికారులు వాటర్ లాగింగ్ పాయింట్ల శాశ్వత నివారణకు ప్రభుత్వం వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్లను చేపట్టింది. రూ. 100 కోట్ల అంచనా వ్యయంతో 50 వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్ నిర్మాణాలను రానున్న రెండు సంవత్సరాలలో చేపట్టాలని నిర్ణయించింది. ఒక్కొక్కటీ రెండు లక్షల లీటర్ల నుంచి 10.4 లక్షల లీటర్ల సామర్థ్యంతో వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్లను రూ. 15.09 కోట్ల వ్యయంతో 14 నిర్మాణ పనులను చేపట్టగా 11 చోట్ల పనులు జరుగుతున్నాయి. ఇందులో మూడు చోట్ల సచివాలయం, రాజ్‌భవన్, సోమాజిగూడ ప్రాంతాల్లో అందుబాటులోకి వచ్చాయి. మిగిలిన చోట్ల పనులు వివిధ పురోగతిలో ఉన్నాయి.
పూర్తిగా నిండిన వాటర్ లాగింగ్ పాయింట్లు
వర్షం కురిసినప్పుడల్లా వాటర్ లాగింగ్ పాయింట్లను గుర్తించామని, వాటర్ లాగింగ్ కాకుండా చర్యలు చేపడుతామని జీహెచ్ఎంసీ రోటీన్ డైలాగ్‌లు గురువారం కురిసిన వర్షానికి ఏ మాత్రం పనిచేయలేదని చెప్పవచ్చు. సిటీలో నిత్యం రద్దీగా ఉండే అమీర్‌పేట, లక్డీకాపూల్, పంజాగుట్ట్ట, ప్రకాశ్‌నగర్, రాణిగంజ్, బషీర్‌బాగ్ చౌరస్తా, పబ్లిక్ గార్డెన్స్ ముందున్న సీసీఎస్ వద్ద భారీగా వర్షపు నీరు నిలిచిపోయి వాహనదారులను ఇబ్బందులకు గురి చేసింది. కాగా జీహెచ్ఎంసీ, ట్రాఫిక్, హైడ్రా బృందాలు వర్షం కురుస్తున్న సమయంలో ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం.
చర్యలు చేపట్టాలి
వర్షం వల్ల ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా ముందస్తు చర్యలు చేపట్టాలని, ఈఆర్టీ బృందాలు అప్రమత్తంగా ఉండాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి గురువారం అధికారులను ఆదేశించారు. ముంపునకు గురైన ప్రాంతాల్లో మ్యాన్‌హోళ్ల దగ్గర హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని, డీప్ మ్యాన్‌హోళ్లను సీవరేజి సూపర్వైజర్లు పర్యవేక్షించాలన్నారు. నగర ప్రజలు ఎలాంటి పరిస్థితుల్లోనూ మ్యాన్‌హోల్ మూతలను తెరవకూడదని ఆయన కోరారు. సమస్యలేమైనా ఎదురైతే జలమండలి కస్టమర్ కేర్ 155313కి కాల్ చేయాలని ఆయన సూచించారు.
కాగా, వర్షానికి చెట్లు విరిగి విద్యుత్తు తీగలపై పడటం గంటల తరబడి విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. సోమాజిగూడలో ఉన్న సూర్య కుటీర్ అపార్ట్మెంట్ వద్ద చుట్టు విరిగి విద్యుత్తు తీగలపై పడటం మూలన కరెంటు సరఫరా నిలిచిపోయింది. పాపిరెడ్డి కాలనీలో ట్రాన్స్ఫార్మర్కు బ్యానర్ చిక్కుకోవడంతో కరెంటు సరఫరా లేకుండా పోయింది. నగరంలో మొత్తం 28 చెట్లు వర్షం కారణంగా పడిపోయాయి. అలాగే గ్రేటర్‌లోని పలు ప్రాంతాల్లో సుమారు నాలుగు గంటలపాటు విద్యుత్ అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో అధికారులు పట్టించుకోకపోవడంతో సామాన్యులు ఇబ్బందులు పడ్డారు. నేరుగా టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ ఫరూఖీ రంగంలోకి దిగి దగ్గరుండి పనులు పరిశీలించారు.