Yakutpura | చార్మినార్, ఫిబ్రవరి 17: స్థానిక సమస్యలను గుర్తించి వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని యాకుత్‌పుర ఎమ్మెల్యే మిరాజ్ జాఫర్ హుస్సేన్ అధికారులను ఆదేశించారు. సోమవారం నసీర్ ఫంక్షన్ హాల్లో వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులతో ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మిరాజ్ జాఫర్ హుస్సేన్ మాట్లాడుతూ.. రానున్న రంజాన్ పర్వదిన వేడుకలకు వివిధ ప్రభుత్వ విభాగాలు సమన్వయంగా అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. స్ట్రీట్ లైట్స్, మంచినీటి సరఫరా, డ్రైనేజీ నీరు రోడ్లపై పారకుండా సీవరేజి అధికారులు, ఎప్పటికప్పుడు రోడ్లపై పేరుకుపోయే వ్యర్థాలను తొలగించడానికి జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.
రంజాన్ మాసంలో మసీదుల వద్ద శుభ్రతను పాటించే విధంగా శానిటేషన్ సిబ్బందిని కేటాయించి ప్రార్థనలకు వచ్చే భక్తుల ఇబ్బందులను దూరం చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో పత్తర్ ఘట్టి, మొఘల్ పుర కార్పొరేటర్లు సోహెల్ ఖాద్రి, నస్రిన్ సుల్తానా తదితరులు పాల్గొన్నారు.