సిటీబ్యూరో, జనవరి 2 (నమస్తే తెలంగాణ) : టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి పోస్టుల భర్తీ కోసం నేడు నిర్వహిస్తున్న రాత పరీక్ష సజావుగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఆర్వో సూర్యలత తెలిపారు. సోమవారం తన చాంబర్లో వివిధ శాఖల అధికారులతో పరీక్షల నిర్వహణ పై సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ.. జిల్లాల్లో 2 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఈ పరీక్ష కేంద్రాల ద్వారా మొత్తం 230 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు తెలిపారు.
పరీక్ష కేంద్రాల్లో ఎలక్ట్రిసిటీ, మరుగుదొడ్లు, తాగునీరు ఉండే విధంగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఎలాంటి అంతరాయం కలుగకుండా ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షల నిర్వహణ కోసం అసిస్టెంట్ లైజన్ ఆఫీసర్లను నియమించినట్లు పేర్కొన్నారు. హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో నేడు నిర్వహించే టీఎస్పీఎస్సీ పరీక్షా కేంద్రాల వద్ద 144సెక్షన్ విధిస్తూ పోలీస్ కమిషనర్లు సీవీ ఆనంద్, స్టీఫెన్ రవీంద్ర ఆదేశాలు జారీ చేశారు.