దుండిగల్, మార్చి 23: బిల్డర్ నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైంది. లిఫ్ట్ చుట్టూ ఎటువంటి ముందస్తు రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో నిర్మాణంలో ఉన్న ఓ బహుళ అంతస్తుల భవనం ఐదో అంతస్తు పై నుంచి లిఫ్ట్ గుంతలో పడిన సెంట్రింగ్ కార్మికుడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. పోలీసులు తెలిపిన ప్రకారం… ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, లలిత్పూర్ జిల్లాకు చెం దిన రాంపాల్ కుసువహ (25) అనే యువకుడు ఉపాధికోసం గత నాలుగు నెలల కిందట నగరంలోని బోరబండలో నివాసముంటున్న సోదరుడి వద్దకు వచ్చాడు.
ఈ క్రమంలో దుండిగల్ మున్సిపాలిటీ పరిధి, బౌరంపేటలోని సింహపురి కాలనీ, లహరి గ్రీన్ పార్క్ రోడ్లో నిర్మాణంలో ఉన్న (ప్లాట్ నంబర్ 466) బహుళ అంతస్తుల భవనంలో గత కొన్ని రోజులుగా సెంట్రింగ్ కార్మికుడిగా పని చేస్తూ అక్కడే నివాసం ఉంటున్నాడు. శనివారం రాత్రి పడుకునేందుకు భవనం ఐదవ అంతస్తుకు వెళ్లే క్రమంలో ప్రమాదవశాత్తు లిఫ్టు గుంతలో పడ్డాడు. దీంతో రాంపాల్ తలకు తీవ్ర రక్తసశ్రావం కావడంతో పాటు లిఫ్ట్ గుంతలో నీరు ఉండటంతో ఊపిరాడక అందులోనే చనిపోయాడు.
ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో రోజు మాదిరిగా పనికి వచ్చిన కార్మికులు రాంపాల్ మృతదేహం లిఫ్ట్ గుంతలో పడి ఉండటం చూసి అతడి సోదరుడికి సమాచారం ఇచ్చారు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసును నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే బిల్డర్ నిర్ల క్ష్యం వల్లే ఈ మరణం సంభవించినట్లు పోలీసులు పేర్కొన్నారు. లిఫ్ట్ చుట్టూ ఎటువంటి రక్షణ ఏర్పాటు చేయకపోవడంతో రాంపాల్ అందులో పడి మృతి చెందినట్లు, పోలీసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.