Elevated Corridor | మేడ్చల్, మే 19(నమస్తే తెలంగాణ): ప్యారడైజ్ నుంచి శామీర్‌పేట రింగ్ రోడ్డు వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సంబంధించి ఇప్పట్లో పనులు ప్రారంభం కష్టంగానే కనిపిస్తున్నది. ప్యారడైజ్ నుంచి శామీర్‌పేట రింగ్ రోడ్డు వరకు 18 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సంబంధించి భూ సేకరణ ప్రక్రియ ఇంకా కొలిక్కి రావడం లేదు. భూ సేకరణ పూర్తయ్యేదేప్పుడు పనులు ప్రారంభయయ్యేదెప్పుడు అన్న సందేహలు వ్యక్తమవుతున్నాయి.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని శామీర్‌పేట రింగ్‌రోడ్డు నుంచి 12 కిలోమీటర్లు కాగా హైదరాబాద్ జిల్లాలోని లోతుకుంట నుంచి ప్యారడైజ్ వరకు 6 కిలో మీటర్లు ఉండగా భూ సేకరణకు సంబందించి నిర్వహిస్తున్న గ్రామ సభల్లో రోడ్డు విస్తరణతో ఆస్తులు కోల్పోతున్న వారు కొందరు న్యాయ స్థానాలను ఆశ్రయించారు. దీంతో భూ సేకరణ ప్రక్రియ ముందుకెళ్లడం లేదు. ఈ నేపథ్యంలో ఎలివేటెడ్ కారిడార్ పనులు ప్రారంభంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి.
200 ఫీట్ల విస్తరణ అవసరం లేదు..
ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సంబంధించి 200 ఫీట్ల విస్తరణ అవసరం లేదని, వంద ఫీట్ల విస్తరణతో ఎలాంటి ఆస్తులు కోల్పోయే అవసరం రానందున వంద ఫీట్ల రోడ్డు విస్తరణనే చేయాలని ఆస్తులు కోల్పోతున్న బాధితులు గ్రామ సభల్లో ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు.
ఒక వేళ తమ భూములు తీసుకుంటే బహిరంగ మార్కెట్లో ఉన్న ధర ప్రకారం తమకు నష్టపరిహారం చెల్లిస్తే తమ భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటిస్తున్నారు. అయితే ఈ డిమాండ్లను ప్రభుత్వానికి విన్నవిస్తామని అధికారులు చెబుతున్నా.. ఇప్పటి వరకు భూ సేకరణ ప్రక్రియపై సర్కారు ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం వెల్లడించలేదని నిర్వాసితులు పేర్కొంటున్నారు. అయితే ఇప్పట్లో భూ సేకరణ ప్రక్రియ తేలేలా కనిపించడం లేదని తెలుస్తున్నది.