సుల్తాన్‌బజార్, డిసెంబర్ 14: కోఠిలోని వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీకి చెందిన విద్యార్థినులు మెస్ ఇన్చార్జి వేధిస్తున్నాడంటూ.. షీటీమ్స్‌కు ఫిర్యాదు చేయడం కలకలం స్పష్టించింది. మహిళా వర్సిటీలో విద్యనభ్యసిస్తున్న పీజీ విద్యార్థినులకు ఉస్మానియా యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్లో వసతి కల్పించారు. కాగా, ఆ హాస్టల్ మెస్ ఇన్చార్జి తమను వేధింపులకు గురిచేస్తున్నాడని పీజీ విద్యార్థినులు ఆన్లైన్లో షీటీమ్స్‌కు ఆదివారం ఫిర్యాదు చేశారు. తాము పడుతున్న వేధింపులపై ఆడియో రూపంలో వెల్లడించారు.
మెస్ ఇన్చార్జి వినోద్ వల్ల హాస్టల్లో ఉండాలంటేనే భయంగా ఉందని, తమ భద్రతే ప్రశ్నార్థకంగా మారిందని విద్యార్థినులు వాపోయారు. ఇప్పటికే వినోద్ వేధింపులతో అనేక మంది విద్యార్థినులు మానసికంగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఈ విషయమై హాస్టల్ వార్డెన్, కళాశాల ప్రిన్సిపాల్‌కు తమ గోడు వెల్లబోసుకున్నా.. పట్టించుకోలేదని, అందుకే షీటీమ్స్‌కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. మెస్ ఇన్చార్జి వినోద్‌పై చట్టపరమైన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరారు.