సిటీబ్యూరో, ఆగస్ట్ 9 (నమస్తే తెలంగాణ): బంగ్లాదేశ్‌కు చెందిన ఓ బాలికను అందంగా ఉన్నావంటూ నమ్మించి.. భారత్ చూసొద్దామంటూ హైదరాబాద్‌కు తీసుకొచ్చి ఇక్కడ బండ్లగూడలో ఓ మహిళ నడుపుతున్న వ్యభిచార కూపంలోకి దించింది మరో బంగ్లా మహిళ. శుక్రవారం తనను ఓ హోటల్లో వ్యభిచారానికి తీసుకెళ్తుండగా బండ్లగూడ పోలీస్‌స్టేషన్ బోర్డు చూసిన బాలిక ఆటో పార్కింగ్ చేయడానికి వెళ్లగానే రోడ్డు దాటి వచ్చి పోలీస్ స్టేషన్లో మహిళా అధికారికి తన పరిస్థితిని వివరించింది.
వెంటనే ఇన్స్పెక్టర్ దేవేందర్, డీఐ శ్రీనివాస్‌లు తమ ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు. బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. గత ఆరునెలలుగా బాలికతో వ్యభిచారం చేయిస్తున్న బండ్లగూడకు చెందిన హజీరాబేగం, మెహిదీపట్నంకు చెందిన షహనాజ్ ఫాతిమా, కంచన్‌బాగ్‌కు చెందిన ఆటోడ్రైవర్ మహ్మద్ సమీర్ల ను బండ్లగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే కేసుకు సంబంధించిన మరో ఇద్దరు నిందితులు బంగ్లాదేశ్‌కు చెందిన రూప, హైదరాబాద్‌కు చెందిన సర్వర్లు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.
భారత్ చూసొద్దామంటూ ..
పోలీసుల వివరాల ప్రకారం.. బంగ్లాదేశ్‌కు చెందిన ఓ బాలిక తన ఇంటిపక్కనే ఉన్న రూప అనే మహిళ వద్దకు స్కూల్ నుంచి రాగానే వెళ్లేది. ఈ క్రమంలో నీవు అందంగా ఉన్నావని.. ఒకసారి భారత్‌కు వెళ్లి అక్కడి ప్రదేశాలు చూసి వద్దామని చెప్పి తీసుకొచ్చింది. రూప మాటలు నమ్మిన బాలిక.. ఆమెతో పాటు భారత్‌కు వచ్చే క్రమంలో రాత్రివేళల్లో బోటులో నది దాటి వచ్చానని, ఆ తర్వాత కోల్‌కతా చేరుకుని అక్కడి నుంచి రైలులో హైదరాబాద్‌కు వచ్చామని ఫిర్యాదులో పేర్కొంది. రూప ..ఆ బాలికను మెహిదీపట్నంలోని షహనాజ్ అనే మహిళ వద్దకు తీసుకు వెళ్లగా చుట్కీ అనే మరో యువతి ఇదే తరహా మోసానికి గురైనట్లుగా తెలిసింది.
తర్వాత సమీర్ అనే ఆటో డ్రైవర్ ఆమెను బండ్లగూడలోని హజీరా అనే మహిళ వద్దకు తీసుకురాగా అక్కడ ఆమెతో హజీరా గలీజ్కామ్కోసం తీసుకొచ్చా మని చెప్పారు. బాలిక ముందు వినకపోవడంతో అక్రమంగా భారత్‌లోకి వచ్చావంటూ.. విషయం తెలిస్తే జైలుకు పోతావని బెదిరించింది. దీంతో భయపడిన బాలిక హజీరా చెప్పినట్లుగానే చేస్తూ వచ్చింది. ఆరునెలల పాటు ఆమెను వివిధ హోటళ్లకు, లాడ్జిలకు తీసుకెళ్లి వ్యభిచా రం చేయించా రు. ఈ సమయంలో ఆమెను మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు పెట్టి.. తప్పించుకునే అవకాశం లేకుండా గట్టి పర్యవేక్షణలో ఉంచారని తెలిపారు.
పోలీస్‌స్టేషన్ బోర్డు చూసి..
శుక్రవారం సమీర్ అనే ఆటోడ్రైవర్ బాలికను ఆటోలో తీసుకెళ్తుండగా బండ్లగూ డ పోలీస్‌స్టేషన్ బోర్డును చూసింది. ఆ క్షణం ఆమె ధైర్యం చేసి అక్కడినుంచి తప్పించుకోవాలని నిర్ణయించుకుంది. హోటల్‌ముందు ఆటో ఆపి..పార్క్ చేయడానికి వెళ్లిన క్రమంలో బాలిక అక్కడినుంచి తప్పించుకుని బండ్లగూడ పీఎస్‌కు వచ్చి అక్కడ ఉన్న మహిళా పోలీస్ అధికారికి సమాచారమిచ్చింది. అప్పటివరకు తాను ఎదుర్కొన్న ఇబ్బందులు, తనకు జరిగిన మోసం చెప్పి ఏడ్చింది.
బాధితురాలి వాంగ్మూలం విన్న తర్వాత సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ చైతన్యకుమార్, చాంద్రాయణగుట్ట డివిజన్ ఏసీపీ సుధాకర్ పర్యవేక్షణలో బండ్లగూడ ఇన్స్పెక్టర్ దేవేందర్, డీఐ శ్రీనివాస్ వారి బృందం రంగంలోకి దిగింది. అధికారుల ఆదేశాల మేరకు ప్రత్యేక ఆపరేషన్ ప్రారంభించి.. నిందితులు హజీరాబేగం, షహనాజ్, సమీర్‌లను అరెస్ట్ చేశారు. యువతిని అక్రమంగా దేశంలోకి తీసుకొచ్చిన బంగ్లాకు చెందిన రూప ప్రస్తుతం పరారీలో ఉందని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి ఆటో, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.