సిటీబ్యూరో, జూలై 29 (నమస్తే తెలంగాణ): స్టెప్కౌంటర్ ప్రకటనలో ప్రమోట్ చేసిన డీమార్ట్ యాప్‌తో నగరానికి చెందిన ఓ మహిళ క్రెడిట్‌కార్డ్ మోసానికి గురైంది. నల్లకుంటకు చెందిన మహిళ జూన్ 1వ తేదీన స్టెప్కౌంటర్ యాప్‌లో డీమార్ట్ రెడీ పేరుతో కిరాణా డిస్కౌంట్లను ఇస్తున్నట్లు వచ్చిన ప్రకటనను చూసి.. ప్రకటనపై క్లిక్ చేయడంతో ఒరిజినల్ డీమార్ట్ యాప్‌ను పోలి ఉండేలా నకిలీ మొబైల్ అప్లికేషన్ ఆమె ఫోన్లో ఇన్స్టాల్ అయింది. అయితే అది ఒరిజినల్ డీమార్డ్ యాప్ అని నమ్మిన బాధితురాలు తన వ్యక్తిగత, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్‌కార్డ్ వివరాలను అందులో నమోదు చేసింది.
ఆ తర్వాత రూ.298 విలువైన కిరాణా ఆర్డర్‌ను ఇవ్వగా.. వెంటనే ఆమె ఫోన్‌కు రూ.44,838, రూ.43,998, రూ.28,685 విలువైన అనధికారిక లావాదేవీలకు సంబంధించిన ఓటీపీలు వచ్చాయి. వీటిని చూసిన వెంటనే తన క్రెడిట్ కార్డ్‌ను బ్లాక్ చేయాలంటూ యాక్సిస్ బ్యాంక్ కస్టమర్ కేర్‌కి ఫొన్‌చేసి చెప్పింది.
అయినప్పటికీ జూన్ 19న ఆమెకు రూ.1,17,521కు సంబంధించిన లావాదేవీలు జరిగినట్లుగా క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ వచ్చింది. దీనిని చూసిన వెంటనే బాధితురాలు బ్యాంక్‌ను సంప్రదింరచగా డెబిట్ అయిన డబ్బు రిఫండ్ కాలేదని చెప్పారు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నకిలీ యాప్‌లు, ఆన్లైన్ లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, వివరాలు నమోదు చేసే సమయంలో భద్రత పాటించాలని సైబర్ పోలీసులు సూచించారు.